జీవం యొక్క శాస్త్రమే జీవశాస్త్రం

జీవం యొక్క శాస్త్రమే జీవశాస్త్రం

4 0
Read Time:13 Minute, 1 Second

రచయిత
ఎం వి చలపతి, నెల్లూరు

chalapathi.venkata.m@gmail.com

జీవశాస్త్రం అంటే? జీవుల గురించిన శాస్త్రం. జీవులంటే? జీవ కణాలతో రూపొందినవి. జీవ కణాలు అంటే? జీవాణువుల చేత తయారైనవి. జీవాణువులంటే? జీవాణువుల గురించి అర్థం చేసుకోవాలంటే ముందు అణువులు అంటే ఏమిటో అర్థం కావాలి.

అణువులంటే అందరికీ తెలిసినదే! పరమాణువులు రసాయన చర్యల ద్వారా బంధించుకొని అణువులుగా రూపొందుతాయి. ఉదాహరణకి రెండు ఆక్సిజన్ పరమాణువులు రసాయనకంగా బంధించుకొని ఒక ఆక్సిజన్ అణువు ఏర్పడుతుంది. ఇలా హైడ్రోజన్, నైట్రోజన్,క్లోరిన్ అణువులు ఏర్పడతాయి. వీటిని మూలకాలు అంటారు. ఒకే రకమైన పరమాణువులు రెండుగాని అంతకన్నా ఎక్కువ పరమాణువులు రసాయనకంగా బంధించుకొని ఏర్పడిన అణువులతో నిండిన పదార్థాలను మూలకాలు అంటారు. మరి కొన్ని పదార్థాలు లోని అణువులు వేరువేరు మూలక పరమాణువులతో రసాయన బంధం ఏర్పరచుకొని ఏర్పడిన వాటిని సంయోగ పదార్థాలు అని అంటారు. ఉదాహరణకు నీరు ఇందులో  ఆక్సిజన్, హైడ్రోజన్ అను రెండు వేరువేరు మూలక పరమాణువులు కలిసి ఒక నీటి అణువుగా రూపొందుతుంది. నీటి అణువులో ఒక ఆక్సిజన్ పరమాణువు, రెండు హైడ్రోజన్ పరమాణువులు ఉంటాయి. దీనిని సంయోగాణువు అని కూడా అంటాం . సంయోగాణువులతో ఏర్పడింది కనుకనీరు ఒక సంయోగ పదార్థం. సంయోగాణువులకు ,సంయోగ పదార్థాలకు మరికొన్ని ఉదాహరణలు సున్నం(కాల్షియం+ఆక్సిజన్), ఉప్పు (సోడియం+క్లోరిన్), సోడా ఉప్పు  (సోడియం+హైడ్రోజన్ +కార్బన్ +ఆక్సిజన్).

ఇప్పుడు  జీవాణువుల గురించి తెలుసుకుందాం

పురుషులందు పుణ్యపురుషులు వేరయా!

అలాగే మనుషులందు మంచి మనుషులు వేరయా!

పురుషుల్ని మనుషుల్ని వేరు వేరుగా చూడాలంటే వారి గుణగణాలను బట్టి చూడాల్సిందేగా, మరి అణువులను,  జీవాణువులను వేరుగా చూడాలంటే వాటి గుణగణాలను లేదా ధర్మాలను బట్టి చూడాల్సిందే.

కాబట్టి ఇప్పుడు ధర్మాలు అంటే ఏమిటో చూద్దాం.

ధర్మం అనేది పదార్థానికి అంటిపెట్టుకొని ఉండే లక్షణం లేదా గుణం.

ధర్మాలు రెండు రకాలు భౌతిక ధర్మాలు, రసాయన ధర్మాలు.

భౌతిక ధర్మాలు అంటే రంగు, ఆకారం, గట్టితనం, సున్నితత్వం, సాంద్రత మొదలైనవి.

రసాయన ధర్మం అంటే చర్యాశీలత. అంటే ఒక పదార్థపు పరమాణువులు గాని అణువులు  గాని వేరే పదార్థపు పరమాణువులు లేదా అణువులతో చర్య నొంది మరొక  కొత్త పదార్ధాన్ని తయారు చేయడం.  ఉదాహరణకు రెండు హైడ్రోజన్ పరమాణువులు ఒక ఆక్సిజన్ పరమాణువుతో చర్యలో పాల్గొనడం వలన మరో కొత్త పదార్థమైన నీరు ఏర్పడుతుంది.

నీటిని కొత్త పదార్థం అంటున్నాం కానీ రసాయన చర్యకు ముందు ఆక్సిజన్ హైడ్రోజన్ విడివిడిగా ఉండేటివి రసాయన చర్య తర్వాత ఆ పరమాణువులే నీటి అణువుగా బంధించుకోవడమే. నీరుగా ఏర్పడడానికి ముందు ఆక్సిజన్ హైడ్రోజన్ లు వాయువులు. రసాయనిక చర్యలో పాల్గొనడం వలన ద్రవ రూప నీటి అణువు గా మారింది. అంటే పదార్థాలు అవే కానీ వాటి ధర్మాలు మాత్రమే మారాయి.

ఆక్సిజన్ రసాయన ధర్మం ఏమిటి అంటే ఆక్సిజన్ హైడ్రోజన్ తో కలిసి నీరుగా ఏర్పడడం అని చెప్పొచ్చు.

హైడ్రోజన్ రసాయన ధర్మం ఏమిటి అంటే హైడ్రోజన్ ఆక్సిజన్ తో కలిసి నీటిని ఏర్పాటు చేయడము అని చెప్పొచ్చు.

నీటి తయారీ విధానం ఏమిటి అని అంటే హైడ్రోజన్ ఆక్సిజన్ల రసాయన ధర్మాలే.

ఒక పదార్థపు తయారీ విధానం,ఆ పదార్థం తయారీలో ఉపయోగపడే పదార్థాల రసాయన ధర్మాలు అని చెప్పవచ్చు కదా!

ఇప్పుడు నిత్యజీవితంలోని రెండు ఉదాహరణలు చూద్దాం.

పసుపు  పసుపు పచ్చ రంగులో ఉంటుంది.  సున్నం  తెలుపు రంగులో ఉంటుంది. ఇవి రెండు కలిస్తే పారాణి తయారవుతుంది. పారాణి అంటే తెలుసు కదా మహిళలు పాదాలకు పూసుకునే ఎర్రటి పదార్థం

            పసుపు సున్నం వాటి మధ్య రసాయన చర్య జరిగిన తర్వాత ఏర్పడిన పదార్థానికి కొత్త లక్షణం అంటే ధర్మం వచ్చి చేరింది. రసాయన చర్యకు ముందు ఉన్న పదార్థాలే తర్వాత కూడా ఉన్నాయి అయితే వాటికి కొత్త ధర్మం వచ్చి చేరింది. అదే ఎరుపు రంగు.

మరో ఉదాహరణ చూద్దాం! పప్పు, ఉప్పు, కారం, కూరగాయల ముక్కలు, నూనె, పోపు పెట్టే దినుసులు అన్నీ కలిపితే తయారయ్యేదానిని కూరకు ముందున్న రూపం అయిన “కూర కలుపు”. ఇప్పుడు ఈ కూర కలుపుని పొయ్యి మీద పెట్టి వేడి చేస్తే తయారయ్యేది కూర. అదే లే… సాంబారు. వేడి చేసినప్పుడు రసాయన చర్య జరుగుతుంది. రసాయన చేర్య జరగడం వలన కూర కలుపు కాస్త కూర అయింది. ఈ రసాయన చర్యలో కొత్తగా ఆ పదార్థాలకి ఒక నూతన ధర్మం వచ్చి చేరింది. ఆ ధర్మాన్ని మనం “రుచి “అంటాం. గుర్తుంచుకోండి రుచి అనేది ఒక రసాయన ధర్మం. ఇది ఆ పదార్థానికి రసాయన చర్య వలన కొత్తగా వచ్చి చేరిన ధర్మం.

ఇలా పదార్థాలు ఒకదానితో ఒకటి కలిసి రసాయన చర్యలో పాల్గొన్నప్పుడు వాటికి నూతన రసాయనధర్మాలు వచ్చి చేరుతూ ఉంటాయి.

అలా రకరకాల పదార్థాలు రసాయన చర్యలో పాల్గొన్నందువలన ఒకానొక పదార్థానికి జీవం అనే రసాయన ధర్మం వచ్చి చేరింది.

ఇందులో గందరగోళం ఏమీ లేదుగా పారాణికి ఎరుపు రంగు కూరకి రుచి అనే రసాయన ధర్మాలుకొత్తగా వచ్చి చేరినట్టు ఒకానొక పదార్థానికి “జీవం” అనే రసాయన ధర్మం వచ్చి చేరింది.

పారాణి ఎరుపు రంగును చూడవచ్చు రుచిని నాలుక మీద వేసుకొని తెలుసుకోవచ్చు అయితే జీవాన్ని ఎలా అర్థం చేసుకోవాలి లేదా తెలుసుకోవాలి.

జీవుల్ని పరిశీలించి జీవం అంటే ఏమిటో నిర్వచించవచ్చు నిర్జీవులకి సజీవులకి మధ్య అనేక తేడాలు ఉన్నాయి అయితే ఆ తేడాలన్నిటికన్నా ఒక ప్రధానమైన తేడా ఉంది ఆ తేడాను బట్టి జీవాన్ని నిర్వచించవచ్చు

నిర్జీవులు జీవుల మద్య ఉండే ఆ ప్రధానమైన తేడా ఏమిటంటే ప్రత్యుత్పత్తి చేయడం అంటే తనలాంటి జీవిని ఉత్పత్తి చేయడం. అంటే తనలాంటి జీవిని ఉత్పత్తి చేయడం అదే ప్రతి ఉత్పత్తి. ప్రత్యుత్పత్తి.

నిర్జీవులు నిర్జీవపదార్థాలతో తయారవుతాయి. అంటే దాని అర్థం నిర్జీవ అణువులతో తయారైనాయి అనే కదా! మరి జీవులు జీవపదార్థంతో తయారవుతాయి. అంటే దాని అర్థం జీవాణువులతో తయారు అవుతాయనే కదా!

ఇప్పుడు మనం నిర్జీవాణువుకు   జీవాణువుకు మధ్య ఉండే తేడాను చాలా సులభంగా అర్థం చేసుకోవచ్చు ఏ అణువైతే తనలాంటి అణువుని తయారు చేయలేదో (ప్రత్యుత్పత్తి చేయలేదో)అది నిర్జీవాణువు. ఏ అణువైతే తనలాంటి అణువుని తయారు చేయగలదో (ప్రత్యుత్పత్తి చేయగలదో) ఆ అణువుని జీవాణువు అంటాము.

నిర్జీవాణువులకు ఉదాహరణలు ఉప్పు, చక్కెర, నీరు, సోడా ఉప్పు, సున్నం లాంటివి ఇది తనలాంటి అణువులని ప్రత్యుత్పత్తి చేయలేవు

జీవాణువులకి ఉదాహరణ డి.ఎన్.ఏ, అర్. ఎన్ .ఏ లు. ఎందుకంటే ఆ అణువులు తమలాంటి అణువులను తయారు చేయగలవు. అంటే ప్రత్యుత్పత్తి చేయగలవు.

అయితే ఈ జీవాణువులు ఎలా తయారవుతాయి అంటే రసాయన చర్యల ద్వారానే తయారవుతాయి. ఆక్సిజన్ హైడ్రోజన్ కలిస్తే నీరు ఏర్పడినట్టు. సోడియం, క్లోరిన్ కలిస్తే సోడియం క్లోరైడ్ అంటే ఉప్పు ఏర్పడినట్టు. ఐరన్, ఆక్సిజన్ కలిస్తే ఐరనాక్సైడ్ అంటే తుప్పు ఏర్పడినట్టు. ఫాస్ఫేటు, చక్కెర, నత్రజని క్షారాలు కలిసి  అంటే రసాయన చర్య లో పాల్గొని డి.ఎన్.ఏ.  ఆర్.ఎన్.ఏ లు ఏర్పడతాయి అలా జీవాణువులు ఏర్పడుతాయి. అంటే జీవం ఒక రసాయన ధర్మం. జీవ రసాయన ధర్మం.

ఎప్పుడైతే డి.ఎన్.ఏ, ఆర్.ఎన్.ఏ లు రసాయన చర్యల ద్వారా ఏర్పడినాయో అప్పుడు జీవం పుట్టింది అని అర్థం. ఈ డి .ఎన్ .ఏ లు ఆర్.ఎన్.ఏలు సంకేత లిపి ద్వారా రసాయన చర్యలను జరిపి ప్రోటీన్లు, నూనెలు, కొవ్వులు పిండి పదార్థాలు ఇంకా అనేక ఇతర పదార్థాలను తయారు చేసి జీవపదార్థాన్ని, జీవ కణాలను జీవులను  నిర్మిస్తాయి.

జీవశాస్త్రం అంటే జీవులు వాటి భౌతిక రసాయన ధర్మాలు. వాటి నిర్మాణాలు. జీవులు ఇతర జీవులతో ఉండే సంబంధాలు, ప్రకృతితో ఉండే సంబంధాలు జీవ పరిణామం అన్నింటిని గురించి తెలియజేసే ఒక సమగ్ర శాస్త్రమే జీవశాస్త్రం.

జీవశాస్త్రంలో ఒక ముఖ్య భాగం అయిన జన్యు శాస్త్రం లో జరిగిన ఆధునిక పరిశోధనలు  ఆధునిక మానవ జాతి ఆఫ్రికాలో ఒక కుదురు నుంచీ, ఆదిమాత నుంచి ఉద్భవించిందని, ఆ మానవజాతి ఆఫ్రికా నుండి ప్రపంచమంతా వలస వెళ్లి వ్యాపించిందని  రుజువుచేశాయి. మానవుల్లో ఆర్యజాతి, అనార్య జాతి, జర్మన్ జాతి, యూరప్ జాతి అని స్వచ్ఛమైన జాతులు ఏవీ లేవు మానవజాతంతా ఒకటేనని తిరుగులేకుండా జన్యు శాస్త్రం రుజువు చేసింది. జాతి అంటే ఏ జీవులైతే తమలో తాము సంపర్కం చేసుకొని ఫలవంతమైన సంతానాన్ని ఇవ్వగలవో ఆ జీవులన్నింటినీ ఒక జాతి కింద పరిగణిస్తారు. ప్రపంచంలోనే ఏ దేశంలో ఉండే వ్యక్తి అయినా మరే దేశంలో నుండే వ్యక్తిని పెళ్లి చేసుకున్నా ఫలవంతమైన సంతానాన్ని కంటారు. ఇదే మానవులందరూ ఒకే జాతి అనే దానికి రుజువు. ఆధునిక జన్యు శాస్త్ర పరిశోధనలు ప్రత్యేకించి డి.ఎన్.ఏ పరిశోధనలు మానవజాతి వలసల చరిత్రలను ఆధారాలతో సహా వెలికిదీసి చరిత్రను పరిపుష్టం చేశాయి. ఇంతకుముందు వరకు చరిత్రను వెలికి తీయడంలో పురావస్తువులు ఉపయోగపడేటివి. ఇప్పుడు పురాతన డి.ఎన్.ఏ పరిశోధనలు, ఆధునిక డి.ఎన్.ఏ పరిశోధనలు మానవజాతి చరిత్రను పునర్నిర్మిస్తున్నాయి.

****

Happy
Happy
80 %
Sad
Sad
0 %
Excited
Excited
20 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
biological sceince Science Menu tickernews