రాజకీయ పార్టీలకు ఎన్నికల సందర్భంగా జనవిజ్ఞానవేదిక, AIPSN చేస్తున్న విజ్ఞప్తి.

రాజకీయ పార్టీలకు ఎన్నికల సందర్భంగా జనవిజ్ఞానవేదిక, AIPSN చేస్తున్న విజ్ఞప్తి.

4 0
Read Time:41 Minute, 53 Second

           అఖిల భారత స్థాయిలో  ఆల్ ఇండియా పీపుల్ సైన్స్ నెట్ వర్క్ (AIPSN) పనిచేస్తున్నది. జన విజ్ఞాన వేదిక తో సహా 40 ప్రజాసైన్సు ఉద్యమ సంస్థలు,ఈ వేదికలో సభ్యులు. ఆయా పార్టీల మేనిఫెస్టోలలో, చేర్చడానికి ఈ క్రింది విషయాలను పరిగణనలోకి తీసుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాము . అనేక కీలకమైన విషయాల పట్ల (సైంటిఫిక్ టెంపర్, సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ, దాని ఆచరణ, పర్యావరణం, జలవనరులు, ఆరోగ్యం, వ్యవసాయం) మా వైఖరులను మీ దృష్టికి తేవాలనుకుంటున్నాము. 18 వ సాధారణ ఎన్నికల సందర్భంలో, లౌకిక ప్రజాస్వామిక పార్టీల మేనిఫెస్టోలలో చేర్చడం కోసం, వారి దృష్టికి ఈ క్రింది విషయాలను తీసుకు వస్తున్నాము.

1.సైంటిఫిక్ టెంపర్ పై

భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 51A (h) ప్రకారం శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడం పౌరుల కర్తవ్యం. కానీ ఇటీవల, ఈ కర్తవ్యానికి, బలమైన సామాజిక-రాజకీయ కథనాల రూపంలోకొత్తసవాళ్లుఎదురవుతున్నాయి. శాస్త్రీయ దృక్పథాన్ని,  నిరూపిత సహేతుక ఆలోచనలను, విజ్ఞాన శాస్త్రాన్ని అంగీకరించే ఏ దృక్పథాన్నయినా వ్యతిరేకించే ప్రయత్నాలు చూస్తున్నాం. వీటన్నింటికీ రాజ్యాధికారం మద్దతు ఉంది.

 మా డిమాండ్ ఏమిటంటే..

* రాజ్యం లేదా ప్రభుత్వం వ్యవహారాలను, మతం నుం1చి వేరు చేయాలి.

* సైన్స్ ను, శాస్త్రీయ పద్ధతులను ప్రజలందరిలోకి తీసుకొని వెళ్లడాన్ని ప్రోత్సహించి, మద్దతుగా నిలవాలి. శాస్త్రీయ దృక్పథాన్ని, హేతుబద్ధ ఆలోచనలను, విమర్శనాత్మక దృష్టిని ప్రోత్సహించాలి.

* శాస్త్రీయ దృక్పథాన్ని రుజువులపై ఆధారపడిన ఆలోచనాక్రమాలను, విమర్శనా పద్ధతులను బలహీనపరచడానికి ప్రస్తుత ప్రభుత్వం అనేక పద్ధతులలో, అనేక చర్యలకు పాల్పడుతున్నది. ఇవి పరిపాలనలో, విద్యారంగంలో, విస్తృత ప్రజా వ్యవహారాలలో కనిపిస్తున్నాయి. వీటిని, వెనక్కు తీసుకోవాలి (reverse).

 *టెక్స్ట్ బుక్ కమిటీలను పునర్మించాలి. ప్రస్తుత ప్రభుత్వం NCERT పుస్తకాలను, సైన్స్ వ్యతిరేక దృక్పథంతో తిరుగ  రాయించింది. తొలగింపబడిన డార్విన్ పరిణామవాద సిద్ధాంతం, అట్లే భారతదేశంలోని ప్రకృతి వనరులు పర్యావరణం ఖనిజ వనరులు మొదలైన చాప్టర్లు /అంశాలు, ప్రాచీన భారతీయ నాగరికత గురించి చెప్పిన లేనిపోని విషయాలు, – ఇవన్నీ సరిదిద్దాల్సి ఉంటుంది. విద్యార్థులలో విమర్శనాత్మక దృష్టిని కాపాడుకోవాలంటే ఇది అవసరం.

* అండర్ గ్రాడ్, పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులలో తప్పనిసరి చేసిన ‘సాంప్రదాయ  భారతీయ  విజ్ఞానం’ కోర్సులను, రీడింగ్ మెటీరియల్ ను పూర్తిగా రివైజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఆప్షనల్ కోర్సులుగా కొత్తగా ప్రవేశపెట్టబడిన, ‘ప్రాచీన మధ్యయుగ భారతదేశంలోని విజ్ఞానం’- కోర్సులను, రీడింగ్ మెటీరియల్  ను రివైజ్  చేయాలి. ఇప్పటికే ఈ అంశాలపై చారిత్రక రుజువులతో కూడిన మెటీరియల్ ఎంతో అందుబాటులో ఉంది.వాటి ఆధారంగా ఇది జరగాలి.

* విస్తృత ప్రజానీకంలో, విద్యా సంస్థలలో,ప్రాచీన భారతదేశం గురించి ప్రచారం చేసిన అశాస్త్రీయభావాలను, కల్పనలను సరిదిద్దాలి. భారతదేశ నాగరికతలో ఉన్న వైవిధ్య భరితమైన, ఇతర నాగరికతల సంపర్కంతో ఎదిగిన భిన్న జ్ఞాన స్రవంతులను పట్టించుకోకుండా, ఓకే సాంస్కృతిక మత  జ్ఞాన స్రవంతిని మౌలికమైనదిగా, గొప్పదిగా చిత్రించే ప్రయత్నం చేశారు. విజ్ఞాన శాస్త్ర పురోగమనపు వాస్తవిక చిత్రాన్ని కప్పిపుచ్చారు. వీటిని సరిదిద్దాలి.

* ప్రకృతి శాస్త్రాలకు,సామాజిక శాస్త్రాలకు సంబంధించిన అకాడమిక్ సంస్థ ల,పరిశోధన సంస్థల స్వతంత్రతను పునరుద్ధరించాలి. పరిశోధన, సర్వేల ద్వారా వచ్చే డేటా, రుజువుల ఆధారంగా ప్రభుత్వవిధానాల రూపకల్పన  కు తగిన స్థానం ఉండాలి. తమ తమ ఐడియా లాజికల్ నేరేటివ్స్ కు తగినట్టుగా డేటాను తారుమారు చేయడాన్ని సరిదిద్దాలి. యూనివర్సిటీలలో, పరిశోధనా సంస్థలలో అకాడమిక్  స్వేచ్ఛలను, అనేకానేక అభిప్రాయాలుండే పరిస్థితిని పునరుద్ధరించి,పరిరక్షించుకోవాలి. శాస్త్ర పరిశోధనా సంస్థల విశ్వసనీయత ను పునరుద్ధరించాలి.

* మంత్ర తంత్ర మార్మిక వైద్యాలు, సూడో సైన్సు, మూఢనమ్మకాల – ప్రచారం, మీడియా ద్వారా ప్రచార వ్యాపారం- వీటిపై గట్టి మానిటరింగ్, నియంత్రణ ఉండాలి. కేంద్ర రాష్ట్రాలలో మూఢనమ్మకాల నిరోధక చట్టాలు తేవాలి.

* జనాభా లెక్కల ఆధారిత పబ్లిక్ పాలసీ ఫ్రేమింగ్ ను మళ్లీ ప్రారంభించాలి.

2. సైన్స్ అండ్ టెక్నాలజీ (S & T)

 శాస్త్ర సాంకేతికాలలో దేశీయ పరిశోధనలకు, మౌలిక పరిశోధనలతో సహా, ప్రభుత్వ కేటాయింపులు జిడిపిలో కనీసం రెండు శాతానికి పెంచాలి.

* రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్  లో  యూనివర్సిటీ వ్యవస్థలకు తగిన బలం సమకూర్చాలి.

* పరిశోధనలకు నిధులను కేటాయించే వ్యవస్థలను, ప్రక్రియలను వికేంద్రీకరణ చేయాలి. రాష్ట్ర

ప్రభుత్వాలకు సరైన నిర్ణయాధికారం లేని, పూర్తిగా కేంద్రీకృత, నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ (నూతన విద్యా విధానం ద్వారా ఏర్పాటు అయినది) ను రద్దు చేయాలి. రాష్ట్రాల విశ్వవిద్యాలయాలలో, పరిశోధనలను ప్రోత్సహించాలి. సెంట్రల్ యూనివర్సిటీలు, జాతీయ శాస్త్ర సాంకేతిక సంస్థల మధ్య సహకారాన్ని పెంచాలి.

* ప్రజా సమస్యల(కరువు,నీటి వనరుల యాజమాన్యం, గ్రామీణ జీవనోపాధులు, మార్జినలైజ్డ్ కమ్యూనిటీల సమస్యలు) పరిష్కారం కోసం,రాష్ట్రస్థాయి చొ రవలతో జరిగే శాస్త్ర సాంకేతిక జోక్యాలకు  నిధులను కేటాయించాలి.

* ‘నాలెడ్జ్ యుగం’ ,ఇంకా ’4వ పారిశ్రామిక విప్లవం’ లాంటి వాటిలో కీలక పాత్ర వహిస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్,బయో, నానో టెక్నాలజీల లో స్వావలంబన సాధించడానికి, అవసరమైన పరిశోధనానిధులను మిషన్ మోడ్  లో కేటాయించాలి. అయితే ఆత్మ నిర్భరత లాంటి విదేశీ ఆధారిత, అవాస్తవిక ధోరణులతో భారతదేశం వెనుకబడిపోయే ప్రమాదం మాత్రం ఉంది. వ్యవసాయంలో మల్టీ నేషనల్ కంపెనీల  ఏకాధిపత్యాన్ని ఎదుర్కొనే విధంగా వ్యవసాయ పరిశోధనలను ప్రోత్సహించాలి. క్లైమేట్  మార్పులను తట్టుకునే, వ్యవసాయాన్ని, హార్టికల్చర్ ను ముందుకు తేవాలి.

* రీసెర్చ్ ఫెలోషిప్పుల సంఖ్యను, ముఖ్యంగా మొదటి తరం విద్యార్థులకు, పెంచాలి. ఫ్యాకల్టీ రీసెర్చ్ స్థానాల సంఖ్యనూ పెంచాలి. పీ.హెచ్.డి సంఖ్యనూ నాణ్యతను పెంచాలి. ఇందులో మన దేశం వెనుకబడి ఉంది.

* STEM (సైన్స్,టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్) రీసెర్చ్ లో, ఉద్యోగాలలో మహిళల భాగస్వామ్యం పెంచడానికి ఒక పద్ధతి ప్రకారం చర్యలు తీసుకోవాలి.

* శాస్త్ర సాంకేతిక సంస్థలలో బ్యూరోక్రాటిజం  తగ్గించే చర్యలు మొదలుపెట్టాలి. అకాడమిక్ స్వేచ్ఛలను, పరిశోధనా సంస్కృతినీ ప్రోత్సహించాలి. తద్వారా మేధో వలసలను తగ్గించాలి. యూనివర్సిటీలలో పరిశోధనా సంస్థలలో, వ్యక్తి భజనలు, బహుళత్వమంటే భయం, వెనక్కు తోసే ధోరణులు-ఉన్నాయి. వీటిని సరిదిద్దాలి.

* కృత్రిమ మేధ, జెనెటిక్ ఇంజనీరింగ్, డేటా మైనింగ్, ఐటీ ద్వారా నిఘా – వీటిని, ప్రజా శ్రేయస్సు రీత్యా, నియంత్రించాలి.

* ప్రభుత్వ నిధులతో నడిచే శాస్త్ర సాంకేతిక సంస్థల మూసివేత నిర్ణయాలను సమీక్షించాలి. ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ ను పునః వ్యవస్థీకరించి  ప్రభుత్వ మద్దతును మళ్లీ కొనసాగించాలి.

* ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్ సాఫ్ట్ వేర్ (FOSS)ను, మోనోపలి ( కాపీ రైట్,పేటెంట్లు) లేని కొత్త సాంకేతికతలను ప్రోత్సహించాలి. అనేక విభాగాలలో( బయో టెక్నాలజీ, ఏఐ, మందుల ఆవిష్కరణ మొ.) నాలెడ్జ్ కామన్స్ ను ప్రోత్సహించాలి.

 * డిజిటల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ను, ప్రజా శ్రేయస్సు రీత్యా , పబ్లిక్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ గా గుర్తించాలి.

* పబ్లిక్ కమ్యూనికేషన్ నెట్ వర్క్ లో ఇన్వెస్ట్మెంట్లు ఉండాలి. సైంటిఫిక్ మరియు అకాడమిక్ ప్రచురణలు,కాపీ రైట్  అడ్డంకులు లేకుండా,అందరికీ అందుబాటులో ఉండాలి.

* ప్రభుత్వ, ప్రజా నిధులతో జరిగే అన్ని పరిశోధనలు,అందరికీ అందుబాటులో తేవాలి.

* కొత్త మందుల, వ్యాక్సిన్ల పరిశోధన ఫలితాలు (విగరస్ డబుల్ బ్లైండ్ క్లినికల్ ట్రైల్స్ విత్ పబ్లికేషన్ ఆఫ్ డేటా) బహిరంగ సమీక్షకు అందుబాటులో ఉంచాలి.

3. పర్యావరణము

  • పర్యావరణ పరిరక్షణ కోసం వివిధ నియంత్రణలు, నిబంధనలను ఇటీవల సరళీకరించారు.ఈ సరళీకరణలు మన సహజ వనరులపై, వాతావరణంపై తీవ్రమైన ప్రభావం చూపుతున్నాయి. ప్రజల జీవనోపాధి, శ్రేయస్సుకు నష్టాన్ని కలిగిస్తున్నాయి.
  • మన నిర్దిష్ట డిమాండ్లు ఇవి…
  • రాష్ట్ర, కేంద్ర స్థాయిల లో పర్యావరణ ప్రభావ అంచనా (EIA), పర్యావరణ క్లియరెన్స్‌ల వ్యవస్థలు, చర్యలు ప్రభావవంతంగా, పారదర్శకంగా, జవాబు దారీగా, ప్రయోజనాల వివాదం లేకుండా ఉండాలి.
  • EIA అనేది స్వతంత్ర పర్యావరణ పరిరక్షణ ఏజెన్సీ ద్వారా నిర్వహించ డాలి. EIA నోటిఫికేషన్‌ 2020ని రద్దుచేసి, సవరించిన మార్గదర్శకాలు జారీ చేయాలి.
  • UNFCCC ఫ్రేమ్‌వర్క్‌ కింద, (అన్ని అభివృద్ధి చెందుతున్న దేశాలకు వర్తిస్తునట్టుగానే) గ్రీన్‌హౌస్‌ వాయు(GHG) ఉద్గారాలను, అన్ని ఆర్థిక కార్యకలాపాలలోనూ తగ్గించడానికి అవసరమైన చర్యలను తీసుకోవాలి.   సమర్థవంతమైన విధానాల ద్వారా, నియంత్రణ ద్వారా డీ-కార్ నైజేషన్‌ ద్వారా అన్ని, రంగాలలో ఇంధన సామర్థ్యం ద్వారా దీన్ని సాధించాల్సి ఉంది. సౌర, పవన పునరుత్పాదక శక్తినీ ప్రోత్సహించాల్సి ఉంటుంది. శిలాజ ఇంధనాల వాడకం నుండి, న్యాయమైన మార్పులు జరగాల్సి ఉంది. ప్రజల మధ్య, ఎనర్జీ వాడకంలో ఉన్న అసమానతలను, తగ్గించాలి. ముఖ్యంగా బలహీన వర్గాల అవసరాలను, (పబ్లిక్‌ ట్రాన్స్‌ పోర్ట్‌) ప్రమోట్‌ చేయాలి. 2025 కు UNకు, ఉద్గారాల తగ్గింపుకై పెట్టాల్సిన జాతీయ ప్రతిపాదనలను (NDC) స్టేక్‌ హోల్డర్స్‌ భాగస్వామ్య చర్చల ద్వారా, తాజా ప్రతిపాదనలు పెట్టాలి.
  •  క్లైమేట్‌ ప్రభావాలను (విపరీత వర్షపాతం, కొండచరియలు విరిగిపడటం, పట్టణ వరదలు, ఉష్ణ తరంగాలు, పట్టణ, తీర ప్రాంత కోసి వేత, సముద్రమట్టం పెరుగుదల), వ్యవసాయం తదితర అంశాలపై పడే  వాతావరణ ప్రభావాలను, పరిష్కరించటానికై, ఒక జాతీయ పథకాన్ని, స్టేక్‌ హోల్డర్స్‌ అందరి (ముఖ్యంగా రాష్ట్రాలు) భాగస్వామ్య ప్రక్రియ ద్వారా రూపొందించాలి. క్లైమేట్‌ బాధిత ప్రజల సమస్యల పరిష్కారం, కేంద్ర ప్రభుత్వం నుండి నిధుల అందుబాటు, రాష్ట్ర ప్రభుత్వాల, స్థానిక ప్రభుత్వాల సామర్ధ్యాలు పెంచడం -జరగాలి.
  • సున్నితమైన హిమాలయ ప్రాంతం, పశ్చిమ కనుమలు, నార్త్‌ ఈస్ట్‌ ప్రాంతాలలో స్థిరమైన, పర్యావరణ/వాతావరణ అనుకూల అభివృద్ధి వ్యూహాలను రూపొందించాలి. కొండ ప్రాంతాలలో, ముఖ్యంగా పశ్చిమ హిమాలయ ప్రాంతంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి, పట్టణీకరణపై సమగ్ర సమీక్షను చేపట్టాలి.
  • ముఖ్యంగా వ్యక్తిగత వాహన వినియోగాన్ని తగ్గిస్తూ ప్రజా సామూహిక రవాణాను ప్రోత్సహించడం, పరిశ్రమలు నిర్మాణ కార్యకలాపాల కాలుష్యాన్ని సమర్థవంతంగా నియంత్రించాలి. పట్టణ ప్రాంతాల్లో వాయు కాలుష్యాన్ని వేగంగా,ఒక లక్ష్యం దిశగా – తగ్గించేట్టు నేషనల్‌ క్లీన్‌ ఎయిర్‌ ప్రోగ్రామ్‌ (NCAP) పూర్తిగా సవరించబడాలి. కేంద్ర,రాష్ట్ర కాలుష్య నియంత్రణ అధికారులను  బలోపేతం చేయాలి.
  • నదీగర్భాలు, వరద మైదానాల క్షీణత, విధ్వంసక అభివృద్ధిని నివారించడానికి తక్షణమే చర్యలను తీసుకోవాలి.
  • అటవీ (పరిరక్షణ) సవరణ చట్టంలోని వివిధ నిబంధనలను రద్దు చేయండి. 2006 చట్టం ప్రకారం గిరిజనులు, ఇతర అటవీ నివాసుల హక్కులను పరిరక్షించాలి.
  • నేషనల్‌  బయోడైవర్సిటీ అథారిటీ అనుమతి లేకుండా కార్పొరేట్‌కు జీవవైవిధ్య వనరులకు సంబంధించిన జ్ఞానాన్ని  దిలీ చేయడానికి అనుమతించే జీవవైవిధ్య సవరణ చట్టం 2023లోని నిబంధనలను రద్దు చేయాలి. స్థానిక సంఘాలకు తగిన పరిహారం లేదా ఈ ప్రయోజనాల వాటాను కూడా పునరుద్ధరించాలి.
  • పర్యావరణ వినాశకరమైన, కార్పొరేట్‌ అనుకూల అండమాన్‌ & నికోబార్‌, లక్షద్వీప్‌ దీవుల అభివృద్ధి ప్రణాళికను రద్దు చేయాలి. లక్షద్వీప్‌లోని స్థానిక జనాభాతో తగిన సంప్రదింపులు లేకుండా, అండమాన్‌లో ఎక్కువగా ఒంటరిగా ఉన్న గిరిజనుల మిగిలిన చిన్న జనాభాకు ప్రమాదం వాటిల్లే అండమాన్‌ & నికోబార్‌లో ప్రతిపాదిత నావికా స్థావరం యొక్క సాధ్యతను పునఃపరిశీలించాలి.
  • అధిక దిగుబడికి సంబంధించిన మిషతో ఈశాన్య ప్రాంతాల్లోనూ, అండమాన్‌ లోనూ పర్యావరణ ప్రమాదకరమైన నేషనల్‌ ఆయిల్‌పామ్‌ మిషన్‌ను రద్దు చేయాలి.

4. నీటి వనరులు

  • నీటిని, అరుదైన ప్రజల సంపదగా   పరిగణిస్తూ జాతీయ నీటి విధానాన్ని మళ్లీ రూపొందించాలి. నీటి సంక్షోభాన్ని తగిన పద్దతుల్లో పరిష్కరించాలి. గృహ అవసరాలు, ఇరిగేషన్‌, పరిశ్రమల అవసరాల కోసం నీటిని సమతుల్యంగా వాడాలి. నదులు ఇతర నీటి వనరులను కాపాడుకోవాలి. భూగర్భ జలాల రీఛార్జి, నీటి నిర్వహణ, ఆడిట్‌, రీసైక్లింగ్‌లపై, దృష్టి పెట్టాలి. తగిన చట్టాలు చేయాలి.
  • ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల ప్రకారం, శుభ్రమైన తాగే కుళాయి నీటిని అన్ని ఇళ్ళకు సరఫరా చేయాలి.
  • పట్టణ ప్రాంతాల్లో నీటి వనరుల, పంపిణీ వినియోగాల ప్రైవేటీకరణను నిలిపివేయాలి. జీవించే హక్కులో భాగంగా నీటి హక్కును గుర్తించాలి.
  • సమర్థవంతమైన చట్టం ద్వారా,  మురుగు, వ్యర్థ-నీటి శుద్ధి, నియంత్రణ, రీసైక్లింగ్‌ విధానాల ద్వారా నదులు, ఇతర నీటి వనరుల కాలుష్యాన్ని నిరోధించాలి. నీటి (కాలుష్య నివారణ మరియు నియంత్రణ) సవరణ, 2024  నిబంధనలను ఉపసంహరించాలి. ఇది రాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డుల (SPCBs)పై, కేంద్రం పెత్తనాన్ని అనుమతిస్తుంది.
  • నదుల అనుసంధానం కోసం తగిన ప్రణాళిక, ప్రాజెక్టుల సమగ్ర సమీక్షను చేపట్టాలి. ముఖ్యంగా హిమాలయ ప్రాంతంలోని ప్రధాన నదుల పరివాహక ప్రాంతాలను రక్షించడానికి మెరుగుపరచడానికి ప్రణాళికను వేసి తక్షణమే అమలు చేయాలి.       పర్వత ప్రాంతాలలో శిలాజ ఇంధనంతో నడిచే వాహనాల కదలికలను, వాయు కాలుష్యాన్ని నియంత్రించడం ద్వారా హిమానీనదం ద్రవీభవన రేటును నియంత్రించడానికై సాధ్యమైన అన్ని చర్యలను తీసుకోవాలి.

5. ఆరోగ్యం

  • ఆరోగ్యాన్ని ఉచితంగా పొందే హక్కులను న్యాయబద్ధం చేయాలి. ఇందుకోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల స్థాయిలో ఆరోగ్య హక్కుల చట్టాలను రూపొందించాలి.
  • ఆరోగ్యం, ఫెడరల్ స్ఫూర్తితో, రాష్ట్రాల పరిధిలో(స్టేట్ సబ్జెక్టు) ఉండాలి.
  • ఆరోగ్యంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేసే ఖర్చు , జిడిపిలో 3.5-5.0 శాతానికి, పెంచాలి. కేంద్ర ప్రభుత్వం వాటా, జిడిపిలో 1% – 2% మేరకు ఉండాలి.
  • ప్రజలు ఆరోగ్యం కోసం పెట్టే ఖర్చులో, సొంత జేబు నుంచి పెట్టుకునే ఖర్చులు(out of pocket) 25 శాతం మించకుండా ఉండేట్టు చూడాలి.  ప్రజా ఆరోగ్య వ్యవస్థను, బలోపేతం చేయడం, విస్తరించడం చేయాలి. నాణ్యమైన ఆరోగ్య సేవలు  అన్ని స్థాయిలలోనూ, ఉచితంగా ఉండేట్టు అందుబాటులోకి తేవాలి. అన్ని రకాల మందులు, ఆరోగ్య పరీక్షలు, టీకాలు ఉచితంగా అందుబాటులోకి తేవాలి. ఆరోగ్య వ్యవస్థలు, స్థానిక సమాజాలకు జవాబుదారీగా వుండాలి.
  • ప్రభుత్వ నిధులతో నడిచే పి‌ఎం‌జే‌ఏ‌వై / ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య భీమా పథకాలను రద్దు చేయాలి. దాని స్థానంలో, ప్రభుత్వాలు నిర్వహించే సార్వత్రిక ఆరోగ్య వ్యవస్థ(యూనివర్సల్ హెల్త్ కేర్)ను అభివృద్ధి చేయాలి.
  • ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యం పేరుతో ఆరోగ్య సేవలను ప్రైవేట్ పరం చేయడం, అవుట్ సోర్సింగ్ ఇవ్వడాన్ని వెనక్కి  తీసుకోవాలి(reverse).
  • హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లను ‘ఆరోగ్య మందిరాలు’ గా రీబ్రాండ్ చేయడాన్ని వెనక్కి తీసుకోవాలి.
  • సంఘటిత, అసంఘటిత రంగాల కార్మికుల ఆరోగ్య రక్షణకై, ఈ‌ఎస్‌ఐ పథకాన్ని సంస్కరించి, విస్తృత పరచాలి.  వృత్తి గత అనారోగ్యాల (occupational diseases) నూ కవర్ చేయాలి.
  •  ప్రైవేట్ ఆరోగ్య  రంగాన్ని, ముఖ్యంగా కార్పొరేట్ ఆసుపత్రులను  సమర్థవంతంగా  నియంత్రించాలి. క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం బలోపేతం చేయాలి. జాతీయ క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం,2010 సవరించి , రోగుల హక్కుల ఛార్టర్ ని అమలు అయ్యేటట్లు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి. సేవల నాణ్యతను, రేట్లనూ  స్థిరీకరించాలి.
  • మానసిక అనారోగ్య సమస్యలున్న వ్యక్తుల హక్కులను గుర్తించాలి. ఆ హక్కులను కాపాడే విధంగా, సమగ్ర చికిత్త్సలను వారికి అందుబాటులోకి తేవాలి. జిల్లా మానసిక ఆరోగ్య పథకాన్ని, జాతీయ ఆరోగ్య మిషన్ తో అనుసంధానం చేసి, కట్టుదిట్టంగా అమలు చేయాలి . 
  •  ప్రజలు కేంద్రంగా, హేతుబద్దమైన మందుల (ఫార్మాస్యూటికల్) విధానం రూపొందించాలి. ధరల నియంత్రణ తోపాటు అశాస్త్రీయమైన, ప్రమాదకరమైన మందులను నిరోధించాలి. సమగ్రమైన (లేబిలింగ్, ప్రిస్క్రిప్షన్, రిటైల్ అందుబాటు) జెనెరిక్ మందుల విధానం రూపొందించాలి. అత్యవసర ( ఎసెన్షియల్) మందులు  అన్ని ప్రభుత్వ వైద్య కేంద్రాలలోనూ అందుబాటులో వుండేటట్లు చూడాలి.
  • ఫార్మాస్యూటికల్ బహుళజాతి కంపెనీల గుత్తాధిపత్యాన్ని, కొన్ని కీలకంశాలలో  బద్దలు కొట్టడానికి చర్యలు తీసుకోవాలి.
  • ప్రభుత్వ రంగ ఫార్మాస్యూటికల్ యూనిట్లను పునరుద్ధరించి,అత్యవసర మందులు, వాక్సిన్ల ఉత్పత్తి చేసి, ప్రైవేటీకరణను ఆపాలి. ఓపెన్ సోర్స్ డ్రగ్ డిస్కవరి పథకాన్ని పునరుద్ధరించాలి. తక్కువ ధరలతోమందుల ఉత్పత్తికి, సాహకారిక పరిశోధనలు (collaborative R&D) జరగాలి. ప్రాణావసరమైన, కీలకమైన మందుల పై జి‌ఎస్‌టి యెత్తివేయాలి.
  • క్లినికల్ ట్రైల్స్ ని కఠినంగా నియంత్రించాలి. అనైతికమైన క్లినికల్ ట్రైల్స్ ని నిషేధించాలి. క్లినికల్ ట్రయల్స్ లో పాల్గొనే వారి హక్కుల కోసం చట్టపరమైన చార్టర్ ని అభివృద్ధి పరచాలి.
  • U .S ప్రభుత్వపు డ్రగ్ చట్టాన్ని అమలు చేసే సంస్థ యూ‌ఎస్‌ఎఫ్‌డి‌ఏ ఆఫీసులు, అధికారులను దేశం నుంచి పంపి వేయాలి. 
  • ఇండియా పేటెంట్ చట్టాలు బలహీన పరచకుండా నిరోధించాలి. తక్కువ ధరల, జెనెరిక్ డ్రగ్స్ దేశీయ ఉత్పత్తిని అడ్డుకుంటున్న స్వేచ్చా వాణిజ్య ఒప్పందాలలోని నిబంధనలను వ్యతిరేకించాలి.
  • అయూష్  వైద్యంపై తగిన నియంత్రణ వ్యవస్థలను ఏర్పాటు చేయాలి. ఈ వైద్యాలలో, రుజువుకు నిలబడగలిగే చికిత్స పద్ధతులను ప్రోత్సహించాలి. 
  • డాక్టర్లు, నర్సుల శిక్షణ కోసం కొత్త ప్రభుత్వ కాలేజీలను, ముఖ్యంగా నార్త్ ఈస్ట్ రాష్ట్రాలకు, పేద రాష్ట్రాలకు ప్రాధాన్యత ఇచ్చి, నిర్మించాలి. ఆరోగ్య కార్యకర్తల కోసం కూడా శిక్షణ సంస్థలను ఏర్పాటుచేయాలి.

6. వ్యవసాయం

  • భూమి, నీరు ఇతర ఉమ్మడి వనరులు అందరికి చెందే ప్రాధమిక జీవన వనరులుగా ఉండాలి.
  • భూమి, నీరు సమన్యాయంతో అందరికీ అందేలా చూడాలి. గ్రామీణ పేదలకు, ఇంటితో కూడిన తోట పొలం ఇవ్వడానికి చట్టం చేయాలి.
  • భూమిలేని వ్యవసాయదారులకు భూమిపై హక్కు కలగచేయాలి.
  • పెరటి తోటలను ప్రోత్సహించాలి, పెరటి కోళ్ళ పెంపకం, పశువుల  శాలలు మరియు సామూహిక వ్యవసాయం ప్రోత్సహించాలి.
  • భూపరిమితి కన్నా ఎక్కువ వున్న ప్రభుత్వ, ప్రైవేట్‌ భూములను రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు తీసుకొని, మిగులు భూమిని భూమిలేని నిరుపేదలకు పునఃపంపిణి చేయాలి.
  • కౌలు రైతుల రిజిస్టర్‌ ఏర్పాటుచేయాలి. చిన్న కమతాల వారికి కౌలు రక్షణ కల్పించాలి. కౌలు రైతులకు చట్టపరమైన సహకారం అందించాలి. అన్ని పధకాలకు కౌలురైతులను కూడా లబ్దిదారులుగా గుర్తించాలి. 
  • మహిళలను రైతులుగా గుర్తించాలి వారికి భూమి పై హక్కులు కల్పించాలి, కౌలుకి తీసుకున్న భూమిపై వారికి కౌలు రక్షణ కల్పించాలి.
  • ఆదివాసీ రైతుల భూమి హక్కులను గుర్తించాలి, అటవీ హక్కుల చట్టాన్ని (ఎఫ్‌ఆర్‌ఏ)అమలు చేయాలి. ఎఫ్‌ఆర్‌ఏ చట్టం క్రింద తిరస్కరణలను పునఃసమీక్షించాలి. భారత అటవీ చట్టం 1927కి చేసిన సవరణలను వెనక్కి తీసుకోవాలి.
  • ఆహార హక్కు, ఉపాధి, విద్యా, ఆరోగ్యం మరియు సామాజిక రక్షణ:
  • గ్రామీణ ప్రాంతాలలో ఉపాధి పని దినాలను 100 నుంచి 200 కు పెంచాలి. ఉపాధి రక్షణ కల్పించి, కనీస వేతనం రోజుకి రు.800/- అమలుచేయాలి.  ఎంజిఎన్‌ఆర్‌ఈజిఏ కింద 100 రోజుల పనిని డిజిటల్‌ అడ్డంకులు ఏవి లేకుండా అమలుచేయాలి.
  • ఎస్సి,ఎస్టి, చిన్న, సన్నకారు రైతుల భూమి అభివృద్ధితో ఉపాధి హామీని అనుసంధానం చేయాలి. దీనితో పాటు ప్రకృతి వ్యవసాయంతో పాటు సమగ్ర వ్యవసాయ పద్ధతులకు మద్దతుగా,  100 రోజుల ఉపాధి హామీని జత చేయాలి. ఈ విధంగా 200 రోజుల గ్రామీణ ఉపాధిలో రోజుకి రు.800/- లబ్ది చేకూరేలా ఏర్పాటు జరగాలి.
  • వృద్ధాప్య పెన్షన్ల చట్టాన్ని తేవాలి.
  • వ్యవసాయ పని ప్రదేశాలలో పిల్లల సంరక్షణ మరియు క్రెట్చ్‌ సదుపాయాలు కల్పించాలి.
  • కుల, జాతి, మత, లింగ ఆధారిత అణచివేతకు వ్యతిరేకంగా రక్షణ కోసం ప్రత్యేక కోర్ట్లు ఏర్పాటు చేయాలి.
  • పట్టణ ఉపాధి హామీ చట్టాన్ని ప్రవేశపెట్టాలి.
  • గ్రామీణ కుటుంబాలలో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసిన యువతకు దగ్గరలో ఉన్న టౌన్లలో ఉపాధి హామీ ఇవ్వాలి.
  • ప్రభుత్వ, బ్యాంక్‌ ఫైనాన్స్‌, ఉత్పత్తి పెట్టుబడులు, విజ్ఞాన వనరులు మార్కెట్‌పై హక్కులు:
  • వ్యవసాయ రంగంలో మూలధన సంచయనాన్ని ప్రస్తుత 15.7 శాతం నుంచి 30 శాతానికి పెంచడానికి 15వ ఆర్ధిక సంఘం నుండి రాష్ట్రాలకు అదనపు బడ్జెట్‌ వనరుల హామీ కావాలి.
  • సంపూర్ణంగా (సంఘటిత మరియు అసంఘటిత) ఋణ మాఫీ అమలు చేయడం ద్వారా ప్రాధమిక ఉత్పత్తిదారులకు ఋణ విముక్తి హామీ ఇవ్వాలి. ప్రాధమిక ఉత్పత్తిదారులకు ప్రాధాన్యాతా రుణాలు ఇవ్వడాన్ని పునరుద్ధరించాలి. వ్యవసాయంలో అధిక వ్యయ ఆర్ధిక వ్యవస్థ నుంచి రైతులను డిలింక్‌ చేసేందుకు సాహా రుణాలను ఆపాలి. వ్యవసాయ మరియు అనుబంధ వృత్తులను కొనసాగించే వారు ఎదుర్కొనే వాతావరణ మార్పు ప్రమాదాన్ని తగ్గించాలి.
  • సమగ్ర వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు చిన్న కమతదారులకు సింగిల్‌ విండో ఋణ సదుపాయం కల్పించాలి, సెల్ఫ్‌ హెల్ప్‌ గ్రూపులు మరియు కుటుంబ శ్రీ లాంటి సంస్థలను బలోపేతం చేయడం ద్వారా మహిళా రైతులకు ప్రభుత్వ పరంగా బ్యాంకుల ద్వారా వ్యవసాయ రుణం పొందాలి.
  • వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర ఇవ్వాలి. సార్వత్రిక ప్రజా పంపిణీ వ్యవస్థ కోసం,  అవసరమైన వ్యవసాయఉత్పత్తులను, ప్రభుత్వమే సేకరించి కొనుగోలు చేయాలి. గ్రామీణ కుటుంబాలు, తయారు చేసే ఉత్పత్తుల (వాల్యూ ఆడెడ్‌)ను, కో-ఆపరేటివ్‌ ద్వారా సేకరించాలి.
  • రాష్ట్ర చట్టసభలు ప్రకటించిన అత్యవసర ప్రాధమిక ఉత్పత్తులను కనీస మద్దత్తు ధరకు, (ఉత్పత్తి వ్యయం ప్లస్‌ 50 శాతం) , ప్రభుత్వ నియంత్రిత మార్కెట్లు కొనుగోలు చేయాలి.
  • వ్యవసాయాన్ని ప్రపంచ వాణిజ్య సంస్థ పరిధి నుంచి తప్పించాలి, స్వేచ్చా వాణిజ్య ఒప్పందాలు ఇక మీదట చేసుకోకూడదు, విత్తనాలపై మేధోసంపత్తి హక్కులు ఇక మీదట వుండకూడదు.
  • బేయర్స్‌, అమేజాన్‌, ఇతరులతో ICAR  సంతకం చేసిన అగ్రిమెంట్లను  ఉపసంహరించుకోవాలి. ప్రభుత్వరంగ సంస్థల ద్వారా పరిశోధన, సలహా, పరీక్ష మరియు విస్తరణ సేవలకు హామీ ఇవ్వాలి.
  • వ్యవసాయ డిజిటలైజేషన్‌కి, వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానాన్ని  అందచేయడానికి అవసరమైన మౌలిక వసతులు, జాతీయ యజమాన్యం నియంత్రణకు దారి తీయాలి.
  • సహకార, సూక్ష్మ, చిన్న వ్యాపార సంస్థలు, ప్రభుత్వ రంగ పరిశ్రమలలో విలువ జత చేయబడిన ఆగ్‌ మార్క్‌ ఉత్పత్తులకు, ఆయా రంగాలలో రిజర్వేషన్లను మళ్లీ ఇచ్చే విధంగా చట్టం చేయాలి.  పెద్ద వ్యాపార సంస్థలను స్థానిక మార్కెట్ల నుంచి దూరంగా ఉంచేందుకు ఇది సహాయపడుతుంది.
  • ప్రాధమిక, ద్వితీయ, తృతీయ రంగాల పరిశ్రమలను, ఆగ్రో ఎకాలజీ తో  అనుసంధానించాలి. శాస్త్రీయమైన, సమన్యాయంతో కూడిన భూమి వినియోగం ఉండాలి.ప్రాంతీయ ప్రణాళిక, మార్కెట్‌ అభివృద్ధి, మరియు సంస్థల సమూహం, సహ ఉత్పత్తులు, ఉప ఉత్పత్తులకు విలువ జత చేయడం- వీటన్నింటి కోసం చట్టబద్దమైన బొర్డులను రాష్ట్ర జిల్లా స్థాయిలలో పునరుద్ధరించాలి.
  • చేపలు పట్టేవాళ్లు, చేపల రైతులు చేపలు అమ్మేవాళ్లను కలుపుకొని, చిన్న  తరహా చేపల కార్మికుల జీవనోపాధి కోసం, సుస్థిర చేపల పెంపకం కోసం- రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలలో చేపల మంత్రిత్వ శాఖను ఏర్పాటుచేయాలి.
  • చేపల పెంపకం విధానాల అమలు, అంతఃరాష్ట్ర వివాదాలు, చేపల రైతులు, చేపలు అమ్మేవాళ్లు మరియు ఇతర అనుబంధ చేపల కార్మికుల సంరక్షణ కోసం జాతీయ కమిషన్‌ని ఏర్పాటు చేయాలి.
  • ప్రతి రాష్ట్రంలోనూ వ్యవసాయం, రైతుల  సంక్షేమం కోసం రాష్ట్రాల  స్థాయిలో కమిషన్లను ఏర్పాటు చేయాలి. 
  • భారత దేశ సహకార డైరీ ఉనికిని కుంగదీసే ప్రైవేట్‌ డైరీ కార్పొరేట్‌ కంపెనీలను మరియు విదేశీ డైరీ ఉత్పత్తులను దిగుమతి చేసుకోవడాన్ని నిలుపుదల చేయాలి.
  • పాలు మరియు పాల ఉత్పత్తులలో స్వేచ్చా వాణిజ్యాన్ని అనుమతించాలనే ప్రణాళికను విడిచిపెట్టాలి.  పాలు మరియు పాల ఉత్పత్తులకు గిట్టుబాటు ధర చెల్లించాలి.

7. విద్యారంగం

  • విద్యారంగానికి, జిడిపిలో 6%, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల బడ్జెట్‌ నుంచి కేటాయించాలి.
  • నూతన విద్యా విధానం(NEP)కు మొదటి ప్రయోగశాలగా ఆంధ్రప్రదేశ్‌ ఉంది. మన రాష్ట్రం ఈ ప్రయోగం నుంచి వెంటనే ఉపసంహరించుకొని, విద్యార్థులతో టీచర్లతో తల్లిదండ్రులతో, మేధావులతో, ఒక చర్చను ప్రారంభించాలి. తెలుగు సమాజ అవసరాలకు, మేధో కృషికి అవసరమయ్యే, ఒక తాజా విధానం కోసం చర్చ జరగాలి.
  • ప్రాథమిక విద్య, హైస్కూల్‌ విద్యలో, ఒక నాణ్యమైన,శాస్త్రీయమైన, సమాజ హితమైన, వైవిధ్యాలను ప్రోత్సహించే విద్యాబోధన ఉండాలి. ప్రతి సబ్జెక్టుకు ఒక ఉపాధ్యాయుడు, ఒక లైబ్రరీ, ఒక మంచి లాబరేటరీ ఉండాలి. ఇవి రోజు వారీగా ఉపయోగపడాలి. మౌలిక వసతులు ఉండాలి. వాటి నిర్వహణకై ప్రత్యేక వ్యవస్థ ఉండాలి. పిల్లలకు ఒత్తిడి లేని, శాస్త్రీయమైన చదువులు ఉండాలి. స్కూళ్లలో క్రీడలకు, ఆరోగ్యకరమైన జీవన శైలులకు ప్రాధాన్యత ఉండాలి. తీవ్రమైన పోటీ కాకుండా, ఆరోగ్యకరమైన పోటీ ఉండాలి. విద్యార్థులలో సహకార స్ఫూర్తిని పెంపొందించాలి.
  • కనీసంఏడవ తరగతి వరకు మాతృభాషలోనే విద్యాబాధన జరగాలి. ఇంగ్లీషులో భాషా నైపుణ్యాలు ప్రతి విద్యార్థి సంతరించుకునేట్టుగా, ఒక భాషగా, ఒక సబ్జెక్టుగా నేర్చుకోవాలి.
  • ఇంటర్మీడియట్‌ విద్య వ్యాపారీకరణకను, ఇప్పటికైనా, ప్రభావంతంగా  నియంత్రించాలి. సైన్స్‌ కోర్సులలో, మొక్కుబడి ప్రయోగాలు కాకుండా, శాస్త్రీయ స్ఫూర్తితో ల్యాబ్‌లను నిర్వహించాలి. ఇంటర్మీడియట్‌, డిగ్రీ కోర్సులలో సామాజిక శాస్త్రాల గ్రూపులను బలోపేతం చేయడానికి, ప్రాచుర్యం తేవడానికి తగిన చర్యలను ప్రభుత్వాలు తీసుకోవాలి. ఇంటర్మీడియట్‌, డిగ్రీ విద్యార్థులకు హాస్టల్‌ వసతికల్పించాలి. మధ్యాహ్నం భోజనం పథకం ప్రారంభించాలి. లెక్చరర్లను రెగ్యులర్‌ పద్ధతిన నియమించాలి. ప్రభుత్వ కాలేజీలలో ఇంటర్‌ విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను ఎప్పటికప్పుడు ప్రభుత్వమే అందజేయాలి.
  • ఎంతో ప్రసిద్ధి చెంది, దశాబ్దాల తరబడి విద్యా పీఠాలుగా వెలుగొందిన యూనివర్సిటీలలో, ఈరోజు రాష్ట్రంలో వెలవెల పోతున్నాయి. వాటి పూర్వ ప్రతిష్టను సాధించడానికి అవసరమైన అన్ని చర్యలను ప్రభుత్వాలు తీసుకోవాలి. డిపార్ట్మెంట్లకు డిపార్ట్మెంట్లు మూతపడుతున్న,ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. తగిన నిధులు నియామకాలు తక్షణ అవసరం.

8. ఆంధ్రప్రదేశ్

1. విభజన హామీల మాటేమిటి?
ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత, ఇది మూడో ఎలక్షన్. విభజన జరిగి పది సంవత్సరాలు అవుతున్నది. పది సంవత్సరాల కాలంలోనే విభజన హామీలు నెరవేర్చాలని రీ ఆర్గనైజేషన్ చట్టం చెబుతున్నది. అయితే ఇప్పటికీ ఏ హామీ కూడా పూర్తిస్థాయిలో అమలు జరగలేదు. ప్రత్యేక హోదా, పోలవరం, 9 కేంద్ర విద్యా సంస్థల ఏర్పాటు, వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ, కడప ఉక్కు లాంటి కీలకమైన హామీల నిరాకరణ కూడా ఉంది. హామీ ఇచ్చిన వివిధ సంస్థల ఏర్పాటు కూడా, అరకొరగానే జరుగుతున్నది. పార్లమెంటులో దాదాపు అన్ని పార్టీలు వీటి అమలుకు పూచి పడ్డాయి. చట్టంలో పెట్టిన పది సంవత్సరాల గడువు ముగియ వస్తున్నది. ఆంధ్ర ప్రజల ఆకాంక్షలుగా మారిన, ఈ చట్టబద్ధ హామీల సాధన అమలుపై ఒక రివ్యూ జరగాల్సిన తక్షణ అవసరం ఉంది. హైదరాబాదులో పదుల సంఖ్యలో పరిశోధన సంస్థలుండగా నవ్యాంధ్రకు ఒక్కటి కుడా మంజూరు కాలేదు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి, కీలకమైన ఈ ఎజెండాపై రాజకీయ పార్టీలు తమ తమ కార్యాచరణ పథకాలను ప్రకటించాలని జన విజ్ఞాన వేదిక విన్నపం చేస్తున్నది.

2. విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు:
తెలుగువారి ఉద్యమాలు,త్యాగాల ఫలితం విశాఖ ఉక్కు. దాన్ని పబ్లిక్ సెక్టార్ పరిశ్రమగా రక్షించుకోవడం అందరి బాధ్యత. సుదీర్ఘకాలంగా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ వ్యతిరేక ఉద్యమం జరుగుతున్నది. విశాఖ ఉక్కు రక్షణకై తమ తమ కార్యాచరణ ప్రణాళికలను ప్రకటించమని జనవిజ్ఞాన వేదిక అన్ని, ఇతర రాజకీయ పార్టీలను కోరుతున్నది.

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Cover Story economic and political socal sciences