ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య హక్కు బిల్లు -2024

ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య హక్కు బిల్లు -2024

1 0
Read Time:40 Minute, 21 Second

ప్రజారోగ్య వేదిక ప్రతిపాదిస్తున్న, జన విజ్ఞాన వేదిక బలపరుస్తున్న ఆరోగ్య హాక్కు బిల్లు

ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య హక్కు బిల్లు —2024

  1. ఉపోద్ఘాతం…………..

సంక్రమిక (అంటువ్యాధులు), సంక్రమికేతర (NCD) వ్యాధుల ప్రాబల్యం రోజురోజుకూ పెరుగుతూ ప్రజలపై ఆర్థిక భారం మోపుతోంది. ఆరోగ్య సదుపాయాల నాణ్యత, అందుబాటు విషయాల్లో అసమానతలు కొనసాగుతున్న పర్యవసానంగా ప్రజల సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక మరియు పర్యావరణ తదితర అంశాల్లో ప్రగతిపై హానికరమైన ప్రభావం పడుతోంది. రాష్ట్రంలోని ప్రజల మధ్య సామాజిక అసమానతలు మరియు పేదరికము పెరుగుతున్నాయి.సాదారణ ప్రజలు రుణగ్రస్తులుగా మిగలడం ఆలోచనాపరులందరిలోనూ తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.

భారత రాజ్యాంగంలో ఆర్టికిల్ 47లో పొందుపరిచిన విధంగా ఆరోగ్యం మరియు సంక్షేమానికి సంబంధించిన అంశాల్లో హక్కులు మరియు సమానత్వాన్ని అమలుపర్చడాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లక్ష్యంగా పెట్టుకుంది. రాజ్యాంగంలోని ఆర్టికిల్ 21 విస్తృత పరిధి ప్రకారం రాష్ట్రంలోని ప్రజలందరికీ ఆరోగ్య హక్కును సుస్థిరపరచడం అందులో భాగమే.

గౌరవంగా, ఆనందంగా జీవిస్తూ రాష్ట్రనిర్మాణం మరియు రాష్ట్ర పురోగతుల్లో పాలుపంచుకోవడానికి అవసరమైన భౌతిక, మానసిక, సామాజిక పరిస్థితులను అత్యున్నత ప్రమాణాల్లో అందుకునే అర్హత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రతి పౌరుడికి ఉంది.

2028 నాటికి అందరికీ ఆరోగ్య హక్కు లక్ష్యాన్ని సాకారం చేసేందుకు రాష్ట్ర ప్రజలందరికీ సమగ్రమైన, నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ, పౌష్టికాహారాన్ని అందించడమే కాక ఆయా సేవలు అందరికీ సమానంగా, ఉన్నత ప్రమాణాలతో, శాశ్వతంగా అందే భరోసాను ఇవ్వాలనుకుంటోంది మన ప్రభుత్వం.

రాష్ట్రంలోని ప్రతి పౌరుడికీ సాధ్యమైనంత అత్యున్నత స్థాయి ప్రమాణాలు కలిగిన ఆరోగ్యం, పోషకాహారం, శ్రేయస్సు మరియు గౌరవప్రదమైన జీవితాన్ని అనుభవించే హక్కులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హామీ ఇస్తోంది.

ఆరోగ్య హక్కు అనేది పలు అంశాలతో కూడిన సమగ్రమైన హక్కు. సకాలంలో, నాణ్యమైన, తక్కువ ఖర్చుతో, సరైన వైద్య సౌకర్యం అందించడంతోపాటు సాంఘిక, ఆర్థిక, సాంస్కృతిక మరియు పర్యావరణ నిర్ణాయకాలు కూడా ఇందులో భాగంగా పరిగణించబడతాయి.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పౌరులందరికీ ఆరోగ్యహక్కును అందించడం పట్ల తన నిబద్ధతకు కట్టుబడి ఉంటూనే, ఈ రంగంలో ఇతర వాటాదారులైన ప్రైవేట్ ఆరోగ్యప్రదాతల, అనధికారిక ఆరోగ్య సంరక్షణ వ్యవస్థల, కమ్యూనిటీ-ఆధారిత సంస్థల, స్థానిక ప్రభుత్వ సంస్థల మరియు రాష్ట్రప్రజల ప్రాధాన్యతను గుర్తిస్తోంది.అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం- సమగ్రమైన, సమానమైన, అందుబాటులో ఉండే, నాణ్యమైన, నివారించదగ్గ, చికిత్స చేయదగిన, ఉపశమన, పునరావాస చర్యలకల్పనకు తోడ్పడే ఆరోగ్య, అత్యవసర సేవలు ప్రజలందరికీ అందించడానికి గాను అవసరమైన సమగ్ర చట్టపరమైన మరియు సంస్థాగత నిర్మాణాన్ని, వ్యవస్థల్నీ, ఆర్థిక యంత్రాంగాన్నీ నెలకొల్పనుంది.
అలాగే రోగనిర్ధారణ పరీక్షల మౌలిక వ్యవస్థలను, పరీక్షా కేంద్రాలను, ఆయా సేవలు అందించే మానవ వనరులను బలోపేతం చేయడం ద్వారా పౌరులందరికీ నాణ్యమైన రోగ నిర్ధారణ సేవలను, అవసరమైన మందులను, ఆరోగ్య సంరక్షణ ఉత్పత్తులను అందించడానికి ప్రయత్నిస్తోంది.
ప్రభావవంతమైన సంస్థాగత యంత్రాంగాన్నీ, వ్యవస్థల్నీ, విధానాల్నీ నెలకొల్పి యూనివర్సల్ హెల్త్ కవరేజ్ అందించే లక్ష్యంలో భాగంగా సాక్ష్యం ఆధారిత వైద్యాన్ని (ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్) అమలుచేయడానికీ ప్రజల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడానికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృషిచేస్తోంది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన పౌరులందరికీ పుట్టుక నుంచి చివరి శ్వాస విడిచేవరకూ నాణ్యమైన వైద్య సేవలను అందించేందుకు కట్టుబడి ఉంది. అందుకుగాను ప్రజారోగ్యవ్యవస్థనీ, నిరాటంకంగా సేవలు అందే విధానాన్నీ పటిష్ఠపరిచి, తగిన రిఫరల్ వ్యవస్థని నెలకొల్పి, అన్ని స్థాయుల్లోనూ సేవలు అందించగలిగేలా ప్రభుత్వ ఆస్పత్రులను సన్నద్ధం చేసి, వైద్య రంగంలో ఉన్న ప్రైవేటు, లాభాపేక్షలేని సంస్థలనుంచి కూడా సరైన ఆరోగ్య సేవలందేలా చూడనుంది. వైద్య, నర్సింగ్, వైద్యాను బంధ(పారామెడికల్) విద్యను సంస్కరించనుంది. రాష్ట్రంలో ఉన్న వైద్య సదుపాయాలు అన్నిటిలోనూ అందరికీ నాణ్యమైన, క్లిష్టమైన సేవలు అందేలా చూడడమే కాక, అవసరమైన మానవ, ఆర్థిక, వస్తు వనరులను సమకూర్చగలనని హామీ ఇస్తోంది.
అంతేకాక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సమగ్రమైన, సమ్మిళిత డిజిటల్ వైద్య వ్యవస్థని నెలకొల్పనుంది. వ్యక్తిగత గోప్యతను కాపాడేలా అత్యధిక భద్రతతో కూడిన నిర్వహణ నియమాలను రూపొందించి తద్వారా నిరంతర, నాణ్యమైన సేవలను అందించడమే కాక వైద్యసేవల ఖర్చును సాధ్యమైనంతగా తగ్గించనుంది.

II. ఆరోగ్య హక్కు యొక్క పరిధి………..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రతి పౌరుడికి పుట్టినప్పటి నుండి మరణించేవరకు ఆరోగ్య హక్కు ఉంటుంది. దీనితో పాటు అదనంగా……

ఎ) నివారణ మరియు ఆరోగ్య సంరక్షణ ప్రోత్సాహక వైద్య సేవలు (ప్రివెంటివ్ మరియు ప్రమోటివ్ హెల్త్ సర్వీసెస్)

  1. సమగ్ర నివారణ, ప్రోత్సాహక ఆరోగ్య సంరక్షణ మరియు పోషకాహార సేవల్లో భాగంగా… పోషకాహార భద్రత, సురక్షిత తాగు నీరు, ఘన వ్యర్ధాలను శాస్త్రీయంగా పారవేయడం, పారిశుద్ధ్య మరియు మురుగు నీటి నిర్వహణ వ్యవస్థను శాస్త్రీయంగా నిర్వహించడం, పర్యావరణ పరిశుభ్రతతోపాటు నీరు, ఆహారరాల ద్వారా వ్యాపించే వ్యాధుల నియంత్రణ, అంటువ్యాధుల నివారణ వాటి ముందస్తు గుర్తింపు, చికిత్సలపై అవగాహన కల్పించడం… ఉంటాయి.
  2. సాంక్రమికేతర వ్యాధుల నివారణకు సంబంధించిన సమాచారాన్ని ప్రజలకు అందజేయడం. ప్రత్యేకించి రక్తపోటు, మధుమేహం, ఊబకాయం మరియు ఇతర సమస్యలకు కారణమయ్యే జీవనశైలి గురించి సమాచారాన్ని అందరికీ చేరేలా చూడడం. ఆ వ్యాధులను తొలిదశలోనే గుర్తించి చికిత్స అందించేలా చర్యలు తీసుకోవడం.
  3. పోషకాహారంపై అవగాహన పెంచడం. తల్లీబిడ్డలకు పోషకాహారాన్ని అదనంగా అందించే విధానాన్ని బలోపేతం చేయడం. రాష్ట్రంలో అమలవుతున్న పోషకాహార పథకాలన్నిటినీ ఏకీకృతం చేయడం. ఉదాహరణకు ఐసీడీఎస్(సమీకృత శిశు అభివృద్ధి పథకం), పాఠశాల, కళాశాల విద్యార్థులకు పోషకాహారం అందించే పథకం, ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా అందించే అదనపు పోషకాహారం తదితర కార్యక్రమాలన్నిటినీ ఒకే గొడుగు కిందికి తేవడం.
  4. వివాహానికి ముందు కౌన్సెలింగ్, అవసరమైనప్పుడు కుటుంబ సమస్యలకు ఫ్యామిలీ కౌన్సెలింగ్ సేవలు అందించడం. పునరుత్పత్తి ఆరోగ్య సదుపాయం, గర్భిణులకు మరియు పిల్లలకు సార్వత్రిక టీకాలు వేయించడం. కాన్పుకు ముందు మరియు ప్రసవానంతర సేవలు అందించడం.
  5. అనారోగ్యాలను ముందుగా గుర్తించడానికి క్రమం తప్పకుండా పరీక్షలు చేయడం. అవసరమైన చికిత్సలు అందించడం. దీర్ఘకాలిక వ్యాధులకు మందులను సరఫరా చేయడం.
  6. నివారణ, ప్రోత్సాహక ఆరోగ్య సంరక్షణ, చికిత్స, అనంతర సేవల నిర్వహణలాంటి వాటన్నిటితో పాఠశాల విద్యార్థులకు సమగ్ర ఆరోగ్య సేవలు అందించడం.
  7. సమగ్ర మానసిక ఆరోగ్య సేవలు—- అన్ని వయసుల వారికి మానసిక సమస్యలకు కౌన్సెలింగ్ సదుపాయంతో సహా మానసికంగా ఆరోగ్యవంతులైన పౌరులకోసం నిరంతర భరోసా.
  8. సాంక్రమిక (అంటువ్యాధులు), సాంక్రామికేతర వ్యాధుల ఉనికిపై గ్రామంలో నమోదు నిర్వహణ (రిజిస్ట్రీ), వైద్యం మరియు పోషకాహార సేవలపై సమాజ ఆధారిత సమీక్ష.

బి) సమీకృత ప్రాథమిక ఆరోగ్యం మరియు పోషకాహార సేవలు (ఇంటిగ్రేటెడ్ ప్రైమరీ హెల్త్ అండ్ న్యూట్రిషన్ సర్వీసెస్)………..

  1. గ్రామ ఆరోగ్య కార్యకర్తలు, ఆరోగ్య సంరక్షణ కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, మొబైల్ ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ఐసీడీఎస్ వ్యవస్థ మరియు ప్రైవేటు రంగ హెల్త్ ప్రొవైడర్స్ నెట్వర్క్ ద్వారా నివారణ, ప్రోత్సాహక, చికిత్స మరియు పునరావాస ఆరోగ్య సేవలతో కూడిన సమగ్ర ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ సేవలను అందించడం.
  2. నిర్ణీత ప్రాంతానికి చెందిన కొన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను కలిపి ఒక కుటుంబ ఆరోగ్య సేవా వ్యవస్థ (ఫ్యామిలీ హెల్త్ సర్వీస్ డెలివరీ సిస్టమ్- ఎఫెచ్ఎస్ఎస్)ను నెలకొల్పడం. ఆ ప్రాంతానికి చెందిన ప్రజలకు సంబంధించిన పునరుత్పత్తి, పిల్లల ఆరోగ్యం, మానసిక ఆరోగ్యానికి మాత్రమే పరిమితం కాకుండా సమగ్రమైన ప్రమోటివ్, ప్రివెంటివ్, క్యూరేటివ్ మరియు రిఫరల్ సేవలను అందించే బాధ్యతలను; అంటువ్యాధులు, జీవనశైలి వ్యాధుల నిర్వహణను ఆ వ్యవస్థకు అప్పగించాలి. కమ్యూనిటీ హెల్త్ హాస్పిటల్ పూర్తి స్థాయి పర్యవేక్షణ బాధ్యతను చేపట్టాలి.
  3. ఎఫెచ్ఎస్ఎస్- తన పరిధిలోని కుటుంబాలన్నిటికీ ఎవరికి అవసరమైన సమగ్ర వైద్య సేవలు వారికి అందిస్తుంది. వ్యక్తిగత గోప్యత రక్షణ చర్యలన్ని తీసుకుంటూ డిజిటల్ ఫ్యామిలీ హెల్త్ రికార్డ్ (డిఎఫ్ హెన్ఆర్)ని నిర్వహిస్తుంది.
  4. అన్ని ప్రజారోగ్య సంస్థలు అందిస్తున్నట్లుగానే- అవుట్ పేషెంట్, ఇన్పేషెంట్ సేవలు, కన్సల్టేషన్, మందులు, వ్యాధి నిర్ధారణ పరీక్షలు, అత్యవసర రవాణా సదుపాయం, శస్త్రచికిత్స మరియు ఇతర చికిత్సా విధానాలు, అత్యవసర చికిత్స తదితరాలన్నీ అందుబాటులో ఉన్న వైద్యసేవల స్థాయికి తగ్గట్టు ఈ చట్టం క్రింద రూపొందించిన నియమాల ద్వారా నిర్దేశించాలి.
  5. ప్రాథమిక ఆరోగ్య సేవలు, సెకండరీ లేదా పై స్థాయి ప్రజారోగ్య సదుపాయాలను సంప్రదించమని పంపించే రిఫరల్ సేవలు- ప్రజారోగ్య వ్యవస్థకు కీలకమూ ప్రత్యేకమూ కావాలి. ఎమర్జెన్సీ లేదా సెల్ఫ్ ఫైనాన్స్ పరిస్థితులు మాత్రమే దీనికి మినహాయింపు.

సి) రెఫరల్ సేవలు………

  1. ఆంధ్రప్రదేశ్ స్టేట్ హెల్త్ అథారిటీ నోటిపై చేసినట్లుగా ఆయా సంస్థలు అందిస్తున్న వైద్య సేవల స్థాయిని బట్టి దీర్ఘకాలిక మరియు తీవ్రమైన అనారోగ్యాలను సరైన ప్రజారోగ్య సంస్థకు లేదా పబ్లిక్ ఫైనాన్స్ హెల్త్ కేర్ ప్రోగ్రామ్ కింద కవరేజ్ కోసం జాబితాలో చేర్చిన ప్రైవేట్ ఆస్పత్రులకు రెఫర్ చేయడానికి గాను ఒక ప్రత్యేక ‘ద్వారపాలక’ (గేట్ కీపింగ్) వ్యవస్థను ఏర్పాటు చేయాలి.

15) అయితే తీవ్ర ఆఘాతం (షాక్), పాము కాటు, జంతు కాటు, గుండె సమస్య, న్యూరో సర్జికల్ ఎమర్జన్సీలు మాత్రమే కాక ఈ చట్టం కింద ఆంధ్రప్రదేశ్ స్టేట్ హెల్త్ అథారిటీ సూచించే ఎమర్జన్సీలకు కూడా ఈ ద్వారపాలక వ్యవస్థ వర్తించదు. అలాగే తమ స్వంత ఖర్చుతో వైద్యం చేయించుకునేవారికీ లేదా స్వచ్ఛందంగా కవరేజి నుంచి మినహాయింపు కోరుకునేవారికీ కూడా ఇది వర్తించదు.

16) అత్యవసర ఆరోగ్య పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజలందరికీ ప్రభుత్వ, ప్రైవేటు, స్వచ్ఛంద ఆసుపత్రులలో ……ఏ తరహా ఆస్పత్రిలోనైనా ముందుగా ఫీజు చెల్లించకుండానే వెంటనే అత్యవసర వైద్య సేవలందుకునే హక్కు ఉంది. అది క్లిష్టమైన ఆరోగ్య పరిస్థితికి కావలసిన అత్యవసర చికిత్స కావచ్చు, కాన్సుకి ముందూ తర్వాతా తల్లీ బిడ్డల సంరక్షణకు కావచ్చు… ఆస్పత్రులు తమ స్థాయికి తగ్గ సేవలను మార్గదర్శకాలకు లోబడి కచ్చితంగా అందించాలి.

17) మెడికో లీగల్ కేసు అన్న అనుమానం వచ్చినా ఏ ఆస్పత్రీ కూడా పోలీసు క్లియరెన్స్ లేదా పోలీసు నివేదిక కోసమో, ఫీజు కట్టడం కోసమో చికిత్సను ఆలస్యం చేయకూడదు, నిరాకరించకూడదు.

18) ఆరోగ్యానికి సంబంధించిన అత్యవసర పరిస్థితులన్నిటిలోనూ ఆంధ్రప్రదేశ్ స్టేట్ హెల్త్ అథారిటీ నిర్ణయించిన నిబంధనలకు లోబడి ఆయా కేసుల్లో చేసిన వైద్యానికి అయిన ఖర్చును ఇతర ఛార్జీలను రాష్ట్ర ప్రభుత్వం నుండి రీయింబర్స్మెంట్ తీసుకునే హక్కు ఆస్పత్రికి ఉంది. అయితే, ఉద్యోగుల స్టేట్ ఇన్సూరెన్స్ (ESI), ఇతర ప్రైవేట్ లేదా పబ్లిక్ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ కింద కవర్ చేయబడిన వ్యక్తులు లేదా యజమాని ఆర్థిక సహాయం అందిస్తున్న సందర్భాల్లో ప్రభుత్వం ఆర్థిక సహాయం చేయదు.

19) వైద్యం, శస్త్రచికిత్స, కాన్పు తదితర అత్యవసర పరిస్థితుల్లో ఏ ఆస్పత్రి కూడా ఏ వ్యక్తికీ ఎట్టి పరిస్థితుల్లోనూ సమగ్ర వైద్య సేవలను నిరాకరించదు. ఒకవేళ ఆ విషయంలో విఫలమైతే చట్టం కింద నిర్దేశించినట్లు శిక్ష, జరిమానా రెండూ ఉంటాయి. ఆ ఆస్పత్రిని మూసివేయడానికే శిక్ష పరిమితం కాదు.

20) నిబంధనల్లో పేర్కొన్నట్టుగా రాష్ట్రంలోని ప్రతి పౌరుడికి- ప్రజారోగ్య సంస్థలు, ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలు మరియు ప్రత్యేక సేవలకోసం ఏర్పాటుచేయబడ్డ కేంద్రాల నుండి ఉచిత సేవలను పొందే హక్కు ఉంది.

డి) ద్వితీయ, తృతీయ స్థాయి (సెకండరీ, టెర్షియరీ) మరియు అధునాతన ఆరోగ్య సంరక్షణ……………..

21) అధునాతన ఆరోగ్య సంరక్షణను అందిస్తున్న … ఆసుపత్రులు, నర్సింగ్ హోమ్లు మొదలైనవి ప్రభుత్వ, ప్రైవేట్, లాభాపేక్ష లేని, అనధికారికంగా- వెల్నెస్ కేర్, పాలియేటివ్ కేర్, పునరావాస సేవలను అందించే వాటితో సహా ద్వితీయ, తృతీయ సంస్థలు లాంటి రాష్ట్రంలోని అన్ని ఆరోగ్య సంరక్షణ సంస్థలు ఆంధ్రప్రదేశ్ స్టేట్ హెల్త్ అథారిటీ వద్ద నమోదుచేయబడతాయి. అథారిటీ నిర్దేశించిన పలు అంశాలను పరిశీలించాక సంస్థలు వివిధ కేటగిరుల్లోకి వర్గీకరించబడతాయి.

22) అన్ని వైద్య సదుపాయాలూ మేలైన సేవలందిస్తూనే వాటితోపాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్య అథారిటీ నిర్దేశించిన విధంగా వైద్య విధానాలూ అనుసరించాలి.

23) అన్ని వైద్య కేంద్రాలూ తాము చికిత్స చేసిన రోగి తాలూకు ఇన్ పేషెంట్, అవుట్ పేషెంట్… ఎవరైనా సరే పూర్తి సమాచారంతో వివరంగా రికార్డును నిర్వహించాలి. వ్యక్తిగత గోప్యత భద్రతకు సంబంధించిన ప్రొటోకాలను అనుసరిస్తూ చికిత్స సమయంలోనూ మరియు తర్వాత కూడా రోగి గౌరవానికి భంగం వాటిల్లకుండా దాన్ని ‘డిజిటల్ ఫ్యామిలీ హెల్త్ రికార్డ్ డేటాబేస్’లో పొందుపరచాలి.

24) సొంత ఖర్చుతో లేదా అటువంటి మరే ఇతర పద్ధతిలో అయినా చికిత్స పొందుతూ చట్టం కింద ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ కవరేజి కోరుకోని వారికి ఈ చట్టం వర్తించదు. సూచించిన ఫారమ్ మీద సంతకం చేసి దానిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్య అథారిటీకి సమర్పించడం ద్వారా ఎవరైనా ఈ చట్టం నుంచి మినహాయింపు పొందవచ్చు.

ఇ) నగరాల్లో ఆరోగ్య సేవలు (అర్బన్ హెల్త్ సర్వీసెస్)…………….

25) అన్ని నగర, పట్టణ ప్రాంతాలలో ప్రభుత్వం సమగ్ర ప్రజారోగ్య వ్యవస్థను నెలకొల్పాలి. వార్డు స్థాయి వైద్య ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి ద్వితీయ, తృతీయ స్థాయి ఆస్పత్రుల వరకూ తగిన రెఫరల్ వ్యవస్థను ఏర్పాటుచేయాలి.
26) రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల ప్రజలకు- నాణ్యమైన నివారణ మరియు ఆరోగ్య సంరక్షణ ప్రోత్సాహక వైద్య సేవలు, చికిత్సలు, పునరావాస, ఉపశమన సేవలను సరైన ఆరోగ్య కేంద్రాలలో అందుబాటులో ఉండాలి.

ఎఫ్) మానసిక ఆరోగ్యం, పాలియేటివ్ మరియు పునరావాస ఆరోగ్య సంరక్షణ…………………….

27) మానసిక ఆరోగ్య సంరక్షణ చట్టం 2017 లక్ష్యాలు, నిబంధనలకు అనుగుణంగా ప్రభుత్వం సమగ్ర మానసిక ఆరోగ్య సేవలను అందిస్తుంది.

28) ప్రభుత్వం తప్పనిసరిగా ఆస్పత్రుల వద్ద పాలియేటివ్ కేర్ (దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారికి ఉపశమనం కలిగించే సేవలు), చికిత్స పొందినవారు పూర్తి స్థాయిలో కోలుకుని తమ పనులు తాము చేసుకునేలా ప్రోత్సహించే పునరావాస సంరక్షణ సేవ (రిహాబిలిటేషన్ ) లను ఏర్పాటు చేయాలి.

29) పాలియేటివ్, రిహాబిలిటేషన్ ఆరోగ్య సేవలు అందించేందుకు గాను ప్రభుత్వం లాభాపేక్ష లేని సంస్థలను ప్రోత్సహించి అండగా నిలుస్తుంది.

జి) ప్రమాణాలు మరియు సేవల్లో నాణ్యత……

30) ఆంధ్రప్రదేశ్ స్టేట్ సెంటర్ ఫర్ హెల్త్ ఎక్సలెన్స్ (APSCHE)ని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. వైద్య సంరక్షణ, సేవల నాణ్యత, ప్రధాన దీర్ఘకాలిక అనారోగ్యాల విషయంలో అవలంబించే చికిత్స విధి విధానాల విషయాలను నిర్ణయించే బాధ్యత ఈ సంస్థ వహిస్తుంది.

III. బాధ్యతలు, హక్కులు మరియు విధులు……..

  1. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ ఈ చట్టం కింద నిర్వచించినట్లుగా సమగ్ర ఆరోగ్య సేవల్ని, నాణ్యమైన కొనసాగింపు సేవల్నీ అందుకునే హక్కు ఉంటుంది. ఆ విధంగా ఈ చట్టంలో నిబంధనలను విశదంగా నిర్దిష్టంగా రూపొందించడం జరుగుతుంది.
  2. రాష్ట్ర పౌరులు మరియు రోగులు ఆరోగ్య సదుపాయాల పట్ల, సేవలు అందించే నిపుణుల పట్ల కొన్ని విధులు బాధ్యతలు కలిగి ఉండాలి. జాతీయ మానవ హక్కుల సంఘం మరియు ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య అథారిటీ సమయానుగుణంగా నిర్దేశించే నియమ నిబంధనలకు లోబడి ఇవి ఉంటాయి.
  3. అన్ని ఆస్పత్రుల ఆరోగ్య సదుపాయాలు కూడా రోగుల పట్ల విధిగా కొన్ని బాధ్యతలు మరియు హక్కులు కలిగి ఉంటాయి. రాష్ట్ర ఆరోగ్య అధారిటీ సమయానుగుణమైన మార్పులతో వీటిని నిర్దేశించిన నిబంధనల్లో చేరుస్తుంది.

IV. ప్రభుత్వ బాధ్యతలు…………..

ఈ చట్టంలోని నిబంధనలను ఆచరణలో తు.చ. తప్పక అనుసరించేలా చేయడానికి కావలసిన వనరులను కల్పించి అన్ని చర్యలు తీసుకునే బాధ్యత ప్రభుత్వానిదే. వీటితోపాటు అదనంగా ప్రభుత్వానికి మరికొన్ని సాధారణ బాధ్యతలు ఉన్నాయి.

రాష్ట్రంలోని ప్రతి పౌరుడికి యూనివర్సల్ హెల్త్ కేర్ అందించాల్సిన లక్ష్యాల సాకారం కోసం వనరుల పరిమాణాన్ని పెంచడంతో పాటు…

1) ‘ఆంధ్రప్రదేశ్ హెల్త్ సిస్టమ్స్ స్ట్రాటజీ అండ్ యాక్షన్ ప్లాన్’ (APHSSAP) అని పిలిచే ఈ చట్టాన్ని అమలు చేసేందుకు అవసరమైన వివరణాత్మక ఫ్రేమ్ వర్క్, వ్యూహాలు, విధానాలు, కార్యాచరణ విధానం, సంస్థాగత నిర్మాణం, మానవ వనరుల ప్రణాళిక, ప్రామాణిక ఆచరణ విధానాలు, పర్యవేక్షణ వ్యవస్థ, ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగం మరియు
వివరంగా నియమనిబంధనలను రూపొందిస్తుంది.

2) రాష్ట్ర ప్రజలందరికీ ఆరోగ్యం మరియు పోషకాహార సేవలను అందించడానికి వీలుగా ఆయా సేవలను ఏకీకృతం చేసేందుకు సమగ్ర సంస్థాగత ఫ్రేమ్ వర్క్ని ఏర్పాటు చేస్తుంది. ఆరోగ్య పోషకాహార సేవలను ఒకే గొడుగు కిందికి తెచ్చి, సదరు సేవలకు బాధ్యత వహించే ప్రభుత్వ శాఖల నిర్మాణాన్నీ, విధినిర్వహణనీ హేతుబద్ధకరిస్తుంది. వారి ఉద్యోగ బాధ్యతలను కచ్చితంగా నిర్వచిస్తూ ముఖ్యమైన పనితీరు సూచికలను గుర్తిస్తూ పర్యవేక్షిస్తుంది.

3) ఆంధ్రప్రదేశ్ స్టేట్ హెల్త్ అథారిటీ (APSHA)ని ఏర్పాటు ఈ చట్టం కింద జరగాలని ఆశిస్తున్న విధులన్నిటినీ నిర్వర్తించ గలిగేలా ఆ సంస్థను బలోపేతం చేస్తుంది. అందుకు అవసరమైన నోటిఫికేషన్లను, నిబంధనలను జారీ చేస్తుంది.

4) ఆరోగ్య సేవలు అందించే వ్యవస్థకు అండగా స్టేట్ సెంటర్ ఫర్ హెల్త్ ఎక్స్ లెన్స్ నెలకొల్పాలి. వైద్య సేవల నాణ్యతకు, ప్రభుత్వ ,ప్రైవేటు వైద్య సంస్థలకు ప్రమాణాలను నిర్దేశించాలి. చికిత్సా విధానాలనూ ప్రోటోకాల్నూ ప్రమాణీకరించాలి. వివిధ వ్యాధుల చికిత్సలకు అయ్యే ఖర్చులను లెక్కవేయాలి.

5) ఆరోగ్యం, పోషకాహారం మరియు మానవ వనరుల సామర్థ్య అభివృద్ధి కోసం ఆంధ్రప్రదేశ్ స్టేట్ హెల్త్ సిస్టమ్స్ రిసోర్స్ సెంటర్ని (APSHSRC) నెలకొల్పాలి. చట్ట ప్రయోజనాలను కాపాడడానికి దీని ద్వారా కార్యాచరణ పరిశోధన నిర్వహించి ప్రభుత్వానికీ ఆంధ్రప్రదేశ్ స్టేట్ హెల్త్ అధారిటీకి వ్యూహమూ విధానాల రూపకల్పనలో తోడ్పాటునందించవచ్చు.

6) ఈ చట్టం కింద జరిగే కార్యక్రమాలకు ఆర్ధిక అవసరాల కోసం ఆంధ్రప్రదేశ్ హెల్త్ అండ్ న్యూట్రిషన్ ఫండ్ (APHNF)ని ఏర్పాటు చేస్తుంది.

7) ప్రజారోగ్య సంస్థలన్నిటిలోనూ తగిన మౌలిక వసతులు ఉండేలా నిర్ధారించుకోవాలి. ఆంధ్రప్రదేశ్ స్టేట్ హెల్త్ అథారిటీ, జాతీయ అథారిటీలు పేర్కొన్న విధంగా ఈ సంస్థలు నాణ్యతా ప్రమాణాలకు కట్టుబడి ఉండేలా చూడాలి.

8) ‘ఆంధ్రప్రదేశ్ హెల్త్ సిస్టమ్స్ స్ట్రాటజీ అండ్ యాక్షన్ ప్లాన్’లో అంతర్భాగమైన ‘ఆరోగ్యం కోసం మానవ వనరుల ప్రణాళిక’లో వివరించిన విధంగా అన్ని సంస్థల్లో అవసరమైన మానవ వనరులు ఉండేలా చూసుకుంటుంది . క్రమానుగతంగా ఆ అవసరాలను నవీకరించాల్సి ఉంటుంది.

9) వైద్యులు, నర్సులు, ఇతర ఆరోగ్య నిపుణులను, కార్యకర్తల నియామకాలు అన్ని స్థాయుల్లోనూ హేతుబద్ధంగా జరిగేలా చూడాలి. వార్షిక రిక్రూట్మెంట్, మానవ వనరుల సమర్ధవంతమైన నిర్వహణ, నిరంతరం నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడం లాంటి చర్యలు చేపట్టాలి.

10) వైద్య, నర్సింగ్, పారామెడికల్ తదితర ఆరోగ్య నిపుణులందరికీ నిరంతర శిక్షణనందించే నోడల్ ఏజన్సీగా హెల్త్ యూనివర్సిటీని బలోపేతం చేయాలి. అందుకు అవసరమైన పాఠ్యాంశాలను, ఫ్యాకల్టీని అభివృద్ధి చేయాలి. పరీక్షలు నిర్వహించి, డిగ్రీలను ప్రదానం చేయాలి.

11) కార్యాచరణ బాధ్యతలు చేపట్టే ప్రతి స్థాయిలోనూ ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగాన్ని ఏర్పాటుచేయాలి. ఫిర్యాదులను సమర్థంగా పరిష్కరించేలా పర్యవేక్షించడం, తగిన దిద్దుబాటు చర్యల కోసం సంస్థాగత యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడం అవసరం.

12) ఆరోగ్య సంరక్షణలో ప్రధాన దశలైన నివారణ, ప్రోత్సాహక, చికిత్స, ఉపశమన, పునరావాస సేవలకు సంబంధించిన రంగాల్లో పరిశోధన, సాంకేతిక అభివృద్ధి, ఆవిష్కరణలను ప్రోత్సహిస్తుంది.

13) పబ్లిక్, ప్రైవేట్ మరియు లాభాపేక్ష లేని ఆరోగ్య వ్యవస్థల మధ్య సన్నిహిత సమన్వయ సహకారాలకు మార్గం సుగమం చేయాలి. యూనివర్సల్ క్వాలిటీ హెల్త్ కేర్ లక్ష్యాన్ని సేవలపరంగానూ, ఆర్థిక పరంగానూ అందుబాటులో ఉండేలా వారి కార్యక్రమాలను సమన్వయపరచాలి.

14) ఆరోగ్య సేవల రంగంలో ప్రభుత్వేతర సంస్థలకు ప్రారంభ ప్రోత్సాహాన్నిచ్చేందుకు పెట్టుబడులు పెట్టడం ద్వారా లాభాపేక్షలేని ఆరోగ్య సంరక్షణ వ్యవస్థకు మద్దతు ఇచ్చినట్టవుతుంది.

15) ఆరోగ్య రక్షణ వ్యవస్థలు జాతీయ, అంతర్జాతీయ ప్రమాణాలకు దీటుగా సేవలు అందిస్తున్నాయని నిర్ధారించుకునేందుకు జాతీయ, అంతర్జాతీయ స్థాయి సంస్థలతో సమన్వయంతో పనిచేయాలి.

16) శాస్త్రీయ అధ్యయనాల మీద ఆధారపడిన ప్రజారోగ్య వ్యవస్థలో ఆయుష్ వ్యవస్థను విలీనం చేసేందుకు కృషి చేయాలి. శిక్షణ, ఆచరణలను పునర్నిర్మించడం ద్వారా ఇది సాధ్యమవుతుంది.

17) ఈ చట్టం యొక్క ఆశయాలు నెరవేరేందుకు అవసరమైన చర్యలను అమలుచేయండి.

V. ఆంధ్రప్రదేశ్ స్టేట్ హెల్త్ అథారిటీ (APSHA)……

ప్రభుత్వం, అధికారిక గెజిట్లో నోటిఫికేషన్ ద్వారా ఆంధ్రప్రదేశ్ స్టేట్ హెల్త్ అధారిటీ (APSHA ) ని ఏర్పాటు చేయాలి. ఇది ఒక స్వతంత్ర నోడల్ ఏజెన్సీగా ఉంటూ రాష్ట్రంలోని అన్ని రకాల ప్రభుత్వ, ప్రైవేటు, లాభాపేక్ష లేని, అనధికారిక, కమ్యూనిటీ నిర్వహణలోని వైద్య సంస్థలన్నీ ప్రజలకు ఆర్థికంగానూ, వసతులపరంగానూ అందుబాటులో ఉండేలా
చూస్తుంది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ హెల్త్ అథారిటీలో ఒక చైర్మన్, నలుగురు సభ్యులు ఐదేళ్ల పదవీకాలంతో పనిచేస్తారు. వీరిని రాష్ట్ర ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, మరియు ప్రతిపక్ష నేత సభ్యులుగా ఉన్న కమిటీ ఎంపిక చేస్తుంది. అంతేకాక మరెవరైనా వృత్తి నిపుణుల్ని కానీ, ఉన్నతాధికారిని కానీ, ఇంకెవరైనా వ్యక్తినికానీ కమిటీలోకి ఆహ్వానించే అధికారం అథారిటీకి ఉంటుంది.

ఏ తీర్మానానైనా విజయవంతంగా ఆమోదించాలంటే అథారిటీలోని ఐదుగురు సభ్యులలో కనీసం ముగ్గురు అనుకూలంగా ఓటు వేయాలి. ఈ అథారిటీ ప్రభావశీలంగా పనిచేసేందుకు కావలసిన వనరులూ, అధికారమూ కల్పించేందుకు కృషిచట్టంలో నియమ నిబంధనలను కచ్చితంగా రూపొందించాలి. ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ స్థాపించబడిన తర్వాత APSHAలో చేర్చబడుతుంది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్య అథారిటీ కింది విధులను నిర్వహిస్తుంది:

1) ఈ చట్టం క్రింద హామీ ఇవ్వబడిన హక్కులను అమలు చేయడానికి అన్ని చర్యలను తీసుకునే అధికారం అథారిటీ కలిగి ఉంటుంది.

2) చికిత్స విధి విధానాల నాణ్యత విషయంలో పెట్టుకున్న ప్రమాణాలు, వేర్వేరు ఆస్పత్రుల్లో వైద్య ఖర్చును నిర్ణయించడం, వాటి అమలుకు హామీ ఇవ్వడం… తదితరాలన్నిటిలోనూ ప్రామాణికాలను ఏర్పాటు చేయడం మరియు అమలు చేయడం

3) భారతీయ ప్రజారోగ్య ప్రమాణాలకు అనుగుణంగానూ అథారిటీ మెరుగుపరిచిన విధంగానూ అన్ని రకాల వైద్య సంస్థల్నీ అంచనా వేసి వర్గీకరించాలి. ఏయే ఆరోగ్య సేవలకు ఎంతెంత ధర అన్నది నిర్ణయించడానికి ఈ వర్గీకరణ తోడ్పడుతుంది.

4) ఈ చట్టం యొక్క లక్ష్యాలను సాధించడానికి తగిన అధ్యయనాలను చేయించాలి. ఆంధ్రప్రదేశ్ స్టేట్ సెంటర్ ఫర్ హెల్త్ ఎక్సలెన్స్ (APSCHE) మరియు ఆంధ్రప్రదేశ్ స్టేట్ హెల్త్ సిస్టమ్స్ రిసోర్స్ సెంటర్ (APSHSRC)… అథారిటీకి అవసరమయ్యే సహాయ సహకారాల్ని అందిస్తాయి.

5) ఆరోగ్య సేవలకు సంబంధించి రాష్ట్రంలో ఉన్న మానవ వనరుల రిజిస్ట్రీని నిర్వహించండి. దానికనుగుణంగా వృత్తి నిపుణులకు, పారా ప్రొఫెషనల్స్కి సమర్థవంతమైన నియామకాలు జరపవచ్చు. అలాగే క్యాన్సర్, అవయవ మార్పిడి, సాంక్రామికేతర వ్యాధులు (NCD), మానసిక రుగ్మతలు తదితర రిజిస్ట్రీలను కూడా నిర్వహించాలి.

6) దరఖాస్తులు, సమస్యలు, ఫిర్యాదులను స్వీకరించి వాటి పరిష్కారానికి చట్టప్రకారం అవసరమైన ఆదేశాలు జారీ చేయడానికి ఇది లీగల్ అథారిటీలా పనిచేస్తుంది. అథారిటీకి సివిల్ కోర్టు స్థాయి అధికారాలు ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్య అథారిటీ ఆదేశాలపై అప్పీలు చేసుకోవడానికి రాష్ట్ర హైకోర్టుకు వెళ్లవలసి ఉంటుంది.

7) మొత్తం ఆరోగ్య వ్యవస్థలను మెరుగుపరచడానికి మరియు రాష్ట్ర ప్రజలందరికీ నాణ్యమైన, అందుబాటులో ఉండే వైద్యసేవల్ని అందించడానికి ఏవైనా నిర్దేశకాలు అవసరమని అథారిటీ భావించిన ఎడల వాటిని ప్రభుత్వానికి గానీ లేదా ఏదైనా ఆరోగ్య ప్రదాతకి గానీ ఆదేశాలను జారీచేయడం.

VI. సార్వత్రిక ఆరోగ్య సంరక్షణకు నిధులు (యూనివర్సల్ హెల్త్ కేర్ ఫైనాన్సింగ్)………

రాష్ట్ర పౌరులకు సార్వత్రిక నాణ్యమైన ఆరోగ్య సంరక్షణను అందించేందుకు మరియు ఆరోగ్య హక్కు చట్టంలోని నిబంధనలను అమలు చేయడానికి అవసరమైన అన్ని కార్యకలాపాలకు ఆర్థిక సహాయం చేయడానికి అవసరమైన బడ్జెట్ కేటాయింపును ప్రభుత్వం హామీ ఇవ్వాలి. ఈ ప్రయోజనం కోసం ప్రభుత్వం క్రింద పేర్కొన్న వాటిని నిర్ధారించాల్సి ఉంటుంది:

ఎ) ప్రతి ఆర్థిక సంవత్సరం చివరిలో ముగియకుండా శాశ్వతంగా కొనసాగే ‘ఆంధ్రప్రదేశ్ హెల్త్ అండ్ న్యూట్రిషన్ ఫండ్’ (APHNF)ని ఏర్పాటు చేయాలి.. రాష్ట్ర ప్రజలకు ఈ చట్టం కింద హామీ ఇవ్వబడిన నివారణ, ప్రోత్సాహక, ఉపశమన మరియు పునరావాస ఆరోగ్యం మరియు పోషకాహార సేవలకు సంబంధించిన అన్ని కార్యకలాపాలకు ఈ నిధి ఆర్థిక సహాయం చేస్తుంది.

బి) ఈ చట్టం ఆమోదం పొంది, చట్టం యొక్క కార్యాచరణ కోసం నియమ నిబంధనలను రూపొందించిన తర్వాత రూ. 5000 కోట్ల సీడ్ క్యాపిటల్తో ఆంధ్రప్రదేశ్ హెల్త్ అండ్ న్యూట్రిషన్ ఫండ్ ను నెలకొల్పాలి.

సి) వార్షిక బడ్జెట్ కేటాయింపులు- రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తి (GSDP)లో 2 శాతం, రాష్ట్ర అభివృద్ధి బడ్జెట్లో 8 శాతం కంటే తక్కువగా ఉండకూడదు. ఏది ఎక్కువైతే దాన్ని ఈ చట్టం అమలులోకి వచ్చిన తేదీ నుండి మూడేళ్లలోపు సాధించాలి. దాంతోపాటు తర్వాత వినియోగదారు ధరల సూచిక (CPI)కు అనుగుణంగా ఏటా బడ్జెట్ కేటాయింపులు పెంచాలి

డి) రాష్ట్రంలో ఆల్కహాల్ మరియు సిగరెట్ల అమ్మకాల ద్వారా వచ్చే మొత్తం ఆదాయంలో 15% కంటే తక్కువ కాకుండా, మరియు పెట్రోలియం ఉత్పత్తుల అమ్మకం ద్వారా వచ్చే మొత్తం ఆదాయంలో 5% ఏటా APRHFకి కేటాయించాలి.

ఇ) అదనంగా… ఆరోగ్యానికి హాని కలిగించే శీతల పానీయలు, ఆల్కహాల్, సిగరెట్లు, పెట్రోలియం ఉత్పత్తులు, మూలికా ఉత్పత్తులు మరియు APSHA ద్వారా గుర్తించబడిన ఇతర పదార్థాలు… వీటన్నిటి అమ్మకాలపై రాష్ట్రం సెస్ మరియు సర్ ఛార్జిలను విధించాలి.

ఎఫ్) ఆంధ్రప్రదేశ్ హెల్త్ అండ్ న్యూట్రిషన్ ఫండ్- మొత్తం అకౌంటింగ్ మరియు ఆడిటింగ్ విధానాలు కంస్టైలర్ మరియు ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా యొక్క పరిశీలనకు లోబడి ఉంటాయి.

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
health