
మీకందరికీ ఒక ప్రశ్న!
మనలో కొంతమంది తెల్లగా, కొందరు చామన ఛాయతో, కొందరు నలుపు వర్ణంలో ఎందుకున్నారు???
ఆలోచించండి….!
సరే,మన”రంగు కథ” నేనే చెప్తాను…వినండి… సారీ
చదవండి!
సుమారు 65,000 సంవత్సరాల క్రితం ఆఫ్రికానుండి బయలుదేరిన హోమో సెపియన్ మానవ సమూహం సుమారు మూడువేల సంవత్సరాలు ఆహార అన్వేషణలో నడిచి, తూర్పు,మధ్యాసియా లోని స్టెప్పీ పచ్చిక మైదానాలను చేరుకున్నారు. వారిలో కొందరు, కొంతకాలం అక్కడే స్థిరపడిపోయారు.వారిలో మరి కొందరు కొంతకాలం తుర్పుగా నడిచి, 60000 సంవత్సరాలకు పూర్వం భారతదేశంలో అడుగు పెట్టి సింధూనదీ పరివాహప్రాంతాలకు చేరుకున్నారు. వీరే భారతదేశ ప్రథమ మానవ సమూహం లేదా ఫస్ట్ ఇండియన్స్ అంటారు. అంతవరకూ మనదేశంలో మానవ జాతి అంటూ లేదు.వీరిలో కొందరు దక్షిణభారతానికి పయనించి అక్కడ కొందరు స్థిరంగా ఉండిపోయారు.వారిలో కొందరు అక్కడినుంచి కూడా ప్రయాణించి తూర్పు ఆసియా, ఆస్ట్రేలియా వైపు కొందరు…, కొందరు తూర్పు ఆసియా, సైబీరియా… అక్కడ్నుంచి బేరింగ్ జలసంధి దాటుకుని అమెరికా ఖండాల్లో ప్రవేశించారు. వీరంతా ఆఫ్రికాలో పరిణామం చెందిన మానవులే.

మధ్య ఆసియాలో స్థిరపడి ఉన్నవారు పశువుల కాపరులుగా మారి “యమ్నాయా” కాపరుల జాతిగా మారారు.వేల సంవత్సరాల కాల గమనంలో వీరి చర్మంలో మార్పు మొదలైంది. భూమికి ఉత్తరార్థ గోళంలో ఉన్న ఆ ప్రాంతాల్లో సూర్యరశ్మి, వెలుతురు తక్కువగా ఉన్నందువలన శరీరంలో విటమిన్ డి తయారీ తక్కువగా ఉండేది. విటమిన్ డి తయారీకి చర్మం ద్వారా సూర్యకాంతి శోషణ జరగాలి. చర్మంలోని మెలనిన్ అనే నలుపురంగు వర్ణద్రవ్యం సూర్యకాంతి శోషణను అడ్డుకుంటుంది. కాబట్టి ఆఫ్రికా నుండి బయలు దేరిన మానవులలో ఉన్న నలుపు రంగు తగ్గిపోవాలి.
అందువల్ల శరీరంలోని నలుపు రంగును నిర్ణయించే ఒక జీన్ SLC24A5 లో mutation (ఉత్పరివర్తన) రావాలి. అలా అనేక వేల సంవత్సరాల కాలగమనంలో ఈ జన్యువులో ఉత్పరివర్తనం వచ్చినందువలన మెలనిన్ వర్ణద్రవ్యం చర్మపు పొరల్లో తగ్గిపోయి చర్మపు నలుపుఛాయ క్రమంగా తగ్గిపోయి ఆ ప్రాంతంలో నివసించిన మానవులు తెల్లగా మారిపోయారు. అలానే ముఖ కవళికలలో కూడా మార్పు మొదలై కాకసాయిడ్ రూపం (నిలువు ముఖాలు) లోకి వచ్చారు.
మన శరీరపు రంగును అనేక జన్యువులు ప్రభావితం చేస్తాయి. అందులో 40% వరకూ SLC24A2 జీన్ ప్రభావం ఉంటుంది. దీనిలోని ఉత్పరివర్తనమే మన శరీరం తెలుపురంగులో మారేందుకు దోహదపడింది.
ఆ తరువాత….
ఈ విధంగా మార్పుచెందిన యమ్నాయా పశువుల కాపరులు తమ రథాలతో,గుర్రాలతో క్రీ.పూ 3500 సంవత్సరాల ముందు తూర్పు ఆసియా వైపు పయనించి, అక్కడ వారి సంతతి “ఆంద్రోనోవో”ANDRONOVO, సింథాష్టా sintastha సంస్కృతులను స్థాపించాక, మళ్లీ అక్కడినుండి కొంతమంది దక్షిణంగా పామీర్ పర్వత శ్రేణులను దాటుకుని మధ్య ప్రాచ్య ఆసియా MIDDLE EAST భూభాగంలోకి ప్రవేశించారు. వీరే ఇండో ఇరానియన్లు INDO IRANIANS. వీరిలో కొంతమంది ఉత్తరభారతంలోకి క్రీ.పూ.2000 నాటికి ప్రవేశించారు. వీరే మనం చెప్పుకుంటున్న ఆర్యులు లేదా INDO ARYANS. అప్పటికి అక్కడ సింధూ నాగరికత శిథిలదశలో ఉంది. ఆ దశలో అక్కడ ఉన్నవారితో వీరి సంపర్కం జరిగింది. అదే సమయంలో సింధు నాగరికత ప్రజలు కొంతమంది దక్షిణాపథానికి పయనమై అప్పటికే ఇక్కడ ఉన్న దక్షిణ భారతీయులతో (HUNTER GATHERERS, NEO LITHIC FARMERS) కలసిపోయారు. వారి సంతతే ద్రవిడులుగా మారారు.

ఉత్తరభారతంలోని ఈ రెండు జాతులవారు (యమ్నాయా మరియు సింధు ప్రజలు) క్రీ.పూ 1500 వరకూ బాగా కలసిపోయారు. వీరి సంతతిలో కొంతమంది దక్షిణ భారతానికి పయనించి అప్పటికే అక్కడ ఉన్న ప్రజలతో కలిసిపోయారు. అలా క్రీ.పూ. 1500 నుండి క్రీ.శ.1 వ సంవత్సరం వరకూ ఈ జాతులన్నీ బాగా కలిసిపోయాయి.అంటే అప్పటికి ఈ మతాలూ, కులాలూ ఏర్పడి, వాటి మధ్య మాత్రమే వివాహాలనే దృక్పథం లేదు. క్రీ.శ.1 సం. తరువాత నుండి ఇప్పటి వరకు కూడా కులాల,మతాల పట్టింపులు ఎక్కువై వివిధ సమూహాల కలయిక ఆగిపోయి, కేవలం కొన్ని సమూహాల ప్రజల మధ్య, కులాల మధ్య మాత్రమే వైవాహిక సంబంధాలు (ENDOGAMY) ఏర్పడినాయి.
ఇలా …..

ఈ SLC24 A5 మ్యుటేషన్ భారతదేశంలోకి “యమ్నాయా” పశువుల కాపరుల సంతతుల ద్వారా ప్రవేశించి మనలో వివిధ చర్మపు రంగుల మిశ్రమ ప్రజలు పుట్టుకొచ్చారు.
ఇక్కడ మనం తెలుసుకోవలసిన విషయం…
అప్పటి ప్రాచీన భారతంలోకి ప్రవేశించిన వారు అచ్చంగా ఇప్పుడు మనదేశంలో లేరు. అంతరించిపోయారు. ఇప్పుడున్న మనదేశ ప్రజానీకం అందరూ మిశ్రమ సంతతే. అనేక జాతుల, సంస్కృతుల సంగమమే.
చూశారా….!
ఎర్రగా బుర్రగా ఉన్నావనే దాని వెనుక ఇంత చరిత్ర ఉంది…ఇంత సైన్స్ ఉంది!!!
డా.కాలేషా బాషా,MS
అసోసియేట్ ప్రొఫెసర్,
గవర్నమెంట్ మెడికల్ కాలేజీ,నెల్లూరు
9885791951
License
All content, except photos and those mentioned otherwise are published under Creative Commons Attribution Share Alike 4.0 International License

Good article
చాలా మంచి సమాచారం ఇచ్చారు…
రంగు కథ సమాచారం చాల బాల వివరించారు